BJP State Committee: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటెవరికి? ఇటువంటి వారికి కమిటీల్లో నో బెర్త్..!

ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట.

BJP State Committee: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటెవరికి? ఇటువంటి వారికి కమిటీల్లో నో బెర్త్..!

Updated On : August 18, 2025 / 9:24 PM IST

BJP State Committee: తెలంగాణ గట్టుపై తన మార్క్‌ పాలిటిక్స్‌ చేస్తోంది బీజేపీ. రాబోయే ఎన్నికల్లో పవర్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం..ఇప్పటి నుంచే అందుకు తగ్గట్లు పార్టీని సమాయత్తం చేస్తోంది. స్టేట్‌ కమిటీ స్ట్రాంగ్‌గా ఉండేలా..పార్టీ యాక్టివిటీ పబ్లిక్‌లోకి వెళ్లేలా వ్యూహరచన చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తోంది.

60 మంది జాబితాతో ఢిల్లీకి..

దీంతో వీలైనంత తొందరగా రాష్ట్ర కమిటీని ప్రకటించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం 60 మంది జాబితాతో ఢిల్లీ వెళ్లి వచ్చారాయన. ఢిల్లీలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్‌తో సమావేశమై రాష్ట్ర కమిటీ కూర్పుపై చర్చించారట.

Also Read: తాడిపత్రి రాజకీయ మంటలు ఆరేదెప్పుడు? ఎలా? సినిమా డైలాగులను మించి ఆ ఇద్దరి కామెంట్స్

అలాగే రాష్ట్ర కమిటీ ఎలా ఉండాలన్న దానిపై సునీల్ బన్సల్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుని తన వ్యూ పాయింట్స్ కూడా బన్సల్‌కు వివరించారట రాంచందర్‌రావు. అయితే 60 మందితో కూడిన జాబితాను మరింత షార్ట్ లిస్ట్ చేసుకుని ఢిల్లీ రావాలని రాంచందర్‌రావుకు సూచించారట సునీల్ బన్సల్. BJP State Committee

19 మందికి మాత్రమే అవకాశం

బీజేపీ రాష్ట్ర కమిటీలో కేవలం 19 మందికి మాత్రమే అవకాశం ఉందట. ఇందులో జాతీయ నాయకుల సూచనల ప్రకారం 40 శాతం పాత కమిటీలో ఉన్న నేతలకు అవకాశం ఇవ్వనున్నారట. 19 మందిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు ఉండేలా చూడాలని జాతీయ నేతల ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయంటున్నారు.

జాతీయ నాయకత్వం సూచనల ప్రకారమే కమిటీ వేస్తున్నామని రాంచందర్‌రావు చెబుతున్నా..కమిటీలో యంగ్ బ్లడ్ ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. 45 సంవత్సరాల లోపు వారిని రాష్ట్ర కమిటీలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారట. ఇదే విషయాన్ని జాతీయ నేతల దగ్గర చెప్పినట్టు పార్టీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల నుంచి సేకరించిన 60 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారట. జాతీయ నాయకత్వం ఇప్పుడు దానిని 40కి కుదించాలని సూచించడంతో ఎవరి పేరు తొలగిస్తారోనన్న ఆందోళనలో పార్టీ నేతలు ఉన్నారట.

యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. మరి..

ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. ఇలాంటి కమిటీలో చోటు ఉంటే బాగుంటుందని భావించే నేతలంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ రాష్ట్ర కమిటీలో కేవలం 19 మందికే అవకాశం ఉండటంతో మిగిలిన నేతలంతా నిరాశచెందక తప్పదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తమకు పదవి కావాలని వచ్చిన నేతలకు క్లియర్‌ కట్‌గా చెప్పేస్తున్నారట.

ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు రాష్ట్ర కమిటీలో పదవి అడగవద్దని..ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న నేతలంతా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని తేల్చి చెబుతున్నారట. సేమ్‌టైమ్‌ జాతీయ నేతల సూచనల ప్రకారం రాష్ట్ర కమిటీ జాబితాను షార్ట్ లిస్ట్ చేసేందుకు మరోసారి ముఖ్యనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.