Telangana bandh : ఈనెల 22న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
ఈనెల 22న తెలంగాణ (Telangana bandh) బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.

Telangana bandh
Telangana : ఈనెల 22న తెలంగాణ (Telangana bandh) బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.
ఓయూ జేఏసీ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ.. మోండా మార్కెట్లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి వలస వచ్చి తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అసలేం జరిగింది..?
తెలంగాణలో కొద్దిరోజులుగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మార్వాడీలు విస్తరిస్తూ అన్ని రకాల వ్యాపారాలనూ కబ్జా చేస్తున్నారని, నాణ్యతలేని, నాసిరకం వస్తువులను అమ్ముతూ ఈ ప్రాంత వ్యాపారస్తులను పరోక్షంగా దెబ్బతీస్తున్నారని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీల విస్తరణతో స్థానిక యువత ఉపాధి కోల్పోతుందని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ వివాదం సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో జరిగిన ఓ ఘటనతో ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై కొందరు మార్వాడీ వ్యాపారులు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటనపై స్పందించిన గాయకుడు, రచయిత గోరేటి రమేశ్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో పెద్దెత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదం మొదలైంది.
ఆగస్టు 18న మార్వాడీ గోబ్యాక్ అంటూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి ఆమనగల్లుకు చెందిన కిరాణ, వస్త్ర, వర్తక సంఘం, స్వర్ణకార సంఘం బంద్ కు పిలుపునిచ్చింది. తాజాగా.. మార్వాడీల దాడికి నిరసనగా ఓయూ జేఏసీ ఈనెల 22న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది.