Telangana Assembly Elections 2023 : తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం.. కాలనీ సంక్షేమ సంఘాలపై కేటీఆర్ కన్ను

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. ప్రచారపర్వం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు....

KTR Election Campaign

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తుది దశకు చేరుకుంది. ప్రచారపర్వం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఓట్లు అభ్యర్థించిన కేటీఆర్ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ ఎన్నికల్లో కాలనీ సంక్షేమ సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

కాలనీ సంక్షేమసంఘాలు కీలకం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాది కాలనీ సంక్షేమ సంఘాలున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ వీరు క్రియాశీలకంగా పనిచేస్తుంటారు. దీంతో కె.టి.రామారావు శుక్రవారం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సంభాషించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించిన కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, హైదరాబాద్ మెట్రో, రౌండ్-ది క్లాక్ విద్యుత్, ఫ్లైఓవర్‌లు,వంతెనల నిర్మాణం గురించి కేటీఆర్ ఓటర్లకు వివరించారు.

శాంతియుత హైదరాబాద్ కోసం…

బీఆర్ఎస్ ప్రభుత్వ పురోగతి గురించి వివరించి, ఎలాంటి వివాదాలు లేని శాంతియుత హైదరాబాద్ గురించి ప్రచారం చేశారు. సీసీటీవీ కెమెరాలతో నగరాన్ని సురక్షితంగా ఉంచడంతోపాటు, భరోసా కేంద్రాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, టీఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాల గురించి ఆయన ప్రస్థావించి ఓటర్లను ఆకట్టుకున్నారు. తెలంగాణలో 24×7 మంచినీటిని సరఫరా చేయాలనేది తన కల అని, దాన్ని సాకారం చేయాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని కేటీఆర్ కోరారు.

ALSO READ : Rapid Rail : తెలంగాణలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన… 2047 కేటీఆర్ హైదరాబాద్ విజన్

నగరంలో మెట్రో రైల్వే లైన్లను 70 నుంచి 250కిలోమీటర్లకు పెంచడం, వరదల నిర్వహణ, మురుగునీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అమలు చేయాలనే తమ బీఆర్ఎస్ భవిష్యత్ ప్రాజెక్టులని కేటీఆర్ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులకు వివరించి చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్ధవంతమైన నాయకత్వం కోసం బీఆర్ఎస్ కు మద్ధతు ఇవ్వాలని కేటీఆర్ అభ్యర్థించారు.

ALSO READ : Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

ప్రగతి కోసం పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని పౌరులను కోరారు.కారు గుర్తుకు ఓటేస్తే ప్రగతికి, మెరుగైన హైదరాబాద్ కు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తన ప్రచారంలో పేర్కొన్నారు. మొత్తం మీద ఎన్నికల తుది ప్రచార ఘట్టంలో కేటీఆర్ ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు