హైదరాబాద్ దాటి మారుమూల పల్లెల వరకు వచ్చేస్తున్నాయ్.. “జాగో తెలంగాణ జాగో” అంటూ కేటీఆర్ కీలక కామెంట్స్‌

జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..

ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వాటిని అమలు చేయట్లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేగాక, హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చుతున్నారంటూ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్ వస్తోందని, మహానగరం హైదరాబాద్ దాటి మారుమూల పల్లెల వరకు వెళ్తుందని చెప్పారు.

“పేదలకు రూ.4000 పెన్షన్ రాదు. ఆడబిడ్డలకు రూ.2500 మహాలక్ష్మి పథకం రాదు. అన్నదాతలకు రుణమాఫీ రాదు. రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా రాదు. మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రాదు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం రాదు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు రావు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావు.

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్. మహానగరం హైదరాబాద్ దాటి మారుమూల పల్లెల వరకు.. జనారణ్యం నుంచి వనారణ్యం వరకు బుల్డోజర్ రాజ్యం. ఆరు గ్యారంటీలు గాలికి.. అడగని గ్యారంటీలు ముందుకు.. జాగో తెలంగాణ జాగో” అని కేటీఆర్ అన్నారు.

కాగా, అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. పోలీసులు సాయంతో హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది.