Formula E Race Case : 4 ప్రశ్నలను 40 సార్లు అడిగారు- ఏసీబీ విచారణపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది?

Formula E Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 6 గంటల పాటు ఏసీబీ ఎంక్వైరీ జరిగింది. ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అధికారులు తనను ఏం అడిగారు? తాను ఏం చెప్పాను? అనే వివరాలు వెల్లడించారు కేటీఆర్. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను అని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ విచారణకు సహకరించాను అని అన్నారు. ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.

పొలిటికల్ ప్రెజర్ తో మీరు కేసులు పెట్టారని వారితో చెప్పాను- కేటీఆర్
”మీరు ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారని ఏసీబీ అధికారులకు చెప్పాను. పొలిటికల్ ప్రెజర్ తో మీరు కేసులు పెట్టారని వారికే చెప్పాను. సీఎం రేవంత్ రెడ్డి రాసిన ప్రశ్నలను ఏసీబీ అధికారులు అడుగుతున్నారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలుస్తారో చెప్పలేదు. నాకు గుర్తు ఉన్నంతవరకు సమాచారం ఇచ్చాను. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : స్విమ్స్ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు, తొక్కిసలాట బాధితులకు పరామర్శ..

ఈ కేసులో విషయం లేదు-కేటీఆర్
”నిజం చెప్పాలంటే ఏసీబీ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కేసులో విషయం లేదు. ఈ కార్ రేస్ ఈవెంట్ హైదరాబాద్ లోనే ఉండాలని కష్టపడి తెచ్చాం. మొదటి సారి భారత్ కు తెచ్చాం. హైదరాబాద్ లోనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ ను ప్రపంచంలో ఒక స్థావరంగా చేయాలనే ఒక విజన్ తో చేసిన పని తప్ప.. ఇందులో పైసలు, అవినీతి అనేది లేదు. అలాంటి పనులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. మేము చెయ్యము. మాకు అలాంటి కర్మ పట్టలేదు అని ఏసీబీ అధికారులకు స్పష్టంగా చెప్పా” అని కేటీఆర్ అన్నారు.

Formula E-Car Race Case

రేవంత్ ను సీఎంగా ప్రజలు గుర్తించడం లేదు- కేటీఆర్
”ఏసీబీ నన్ను 82 ప్రశ్నలు అడిగింది. మేము ఎలాంటి అవినీతి పాల్పడకుండా పాలన చేశాము. రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. రేవంత్ కు భయపడే బీఆర్ఎస్ కార్యకర్త లేడు. ఇప్పటికే సీఎంగా రేవంత్ ను ప్రజలు గుర్తించడం లేదు. దానికి మాది తప్పు కాదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. మేము ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతాం. నన్ను అడిగేందుకు ఏసీబీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వారి దగ్గర ప్రశ్నలు లేవు. రేవంత్ మళ్ళీ ప్రశ్నలు పంపిస్తే ఏసీబీ అధికారులు పిలుస్తారు” అని కేటీఆర్ అన్నారు.

Also Read : ‘గేమ్‌ఛేంజ‌ర్‌’కు ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇవ్వ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి? : రసమయి బాలకిషన్