KTR: లగచర్ల వ్యవహారంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే స్పందించాలి: ఢిల్లీలో కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం, జాతీయ కమిషన్లు స్పందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు.

Ktr

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో తెలంగాణ సీఎం తన అల్లుడి కంపెనీ కోసం భూములు లాక్కుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలుగా సీఎం నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోలేదని చెప్పారు. 60 -70 లక్షల విలువ చేసే భూములకు పది లక్షలు ఇస్తామంటున్నారని అన్నారు.

లగచర్లలో ఫార్మా బాధితులు జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్ కు తమ ఆవేదనను తెలిపారని కేటీఆర్ చెప్పారు. లగచర్ల వ్యవహారంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే స్పందించాలని నిలదీశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ ప్యాకేజీ నడుస్తుందని అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ పేదల కోసం చేసే పార్టీ అని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. లగచర్ల బాధితులకు రాహుల్ గాంధీ సమయం ఇవ్వాలని అన్నారు. రాహుల్ మాటల్లోనే ప్రేమ చూపితే సరిపోదని, చేతల్లోనూ చూపించాలని చెప్పారు.

పార్లమెంట్ సమావేశాల్లో లగచర్ల అంశాన్ని లెవనెత్తుతామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ కమిషన్లు స్పందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. లగచర్ల బాధితులకు న్యాయం జరగగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం లగచర్ల వ్యవహారంపై సీఎస్, డీజీపీకి నోటీసులు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల బాధితుల పట్ల ప్రజాస్వామ్యయుతంగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

నియంత రాజ్యమ‌ది: ఎక్స్‌లో కేటీఆర్
“ప్రశ్నిస్తే సంకెళ్లు…నిల‌దీస్తే అరెస్టులు.. నియంత రాజ్యమ‌ది…నిజాం రాజ్యాంగ‌మిది.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్.. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్! ప్రజాస్వామ్య ప్రేమికులం.. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం! నీ అక్రమ అరెస్టులకో.. నీ ఉడత బెదిరింపులకో.. భయపడం..! నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ! అని కేటీఆర్ ఎక్స్‌లోనూ ట్వీట్ చేశారు.

 

కులగణనలో కవిత పేరు నమోదు చేసుకున్నారు.. కేటీఆర్, హరీశ్‌ కూడా నమోదు చేసుకోవాలి: పొంగులేటి