ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ అర్థరాత్రి వరకే అనుమతి

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు, పోలీసులు చర్యలు చేపట్టారు.

Khairatabad Ganapati

Khairatabad Ganapati : వరుస సెలవులు రావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం భక్తుల రద్దీ కొనసాగగా.. ఆదివారం ఉదయం నుంచి మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐమాక్స్ వైపు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉంది. భారీగా తరలివస్తున్న భక్తులతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు, పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ మోనిటరింగ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Also Read : Balapur Ganesh : లక్షలు కట్టాల్సిందే.. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలు

మహాగణపతిని 17వ తేదీ (మంగళవారం) హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి మహాగణపతి దర్శనాలకు అనుమతిని నిలిపివేయనున్నారు. నిమజ్జనం మంగళవారం ఉండటంతో.. సోమవారం నిమజ్జనానికి ఏర్పాట్లు చేయనున్నారు. శోభాయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 17వ తేదీ శోభాయాత్ర అనంతరం.. హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జనం జరగనుంది.