నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి

మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేశామని తెలిపారు. మహిళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

women zero tickets

Mahalakshmi Scheme Zero Tickets : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పథకం అమలులో భాగంగా నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రతి మహిళా ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకొని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టిక్కెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో నిన్న సాయంత్రం ఎండీ సజ్జనార్ వర్చువల్ గా సమావేశం అయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తుంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసింది. ఆ సాఫ్ట్ వేర్ ను టిమ్ మిషన్ లో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోంది. మిషన్ ల ద్వారా ఇవాళ్టి నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి.

Also Read : నేడు తెలంగాణ అసెంబ్లీ ఉభయసభల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇదే తొలి ప్రసంగం

స్థానికత, ధృవీకరణ కోసం వాటిని బస్ కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సివుంటుంది. అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్స్ ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేశామని తెలిపారు. మహిళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని కోరారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం నుంచి మహీలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.