Mallu Swarajyam (1)
Mallu Swarajyam : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల.. యావత్ సమాజం నివాళులర్పిస్తోంది. ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైందంటూ.. కన్నీటిపర్యంతమవుతోంది. జీవితకాల స్ఫూర్తిని మనకు మిగిల్చిన విప్లవ వీరమహిళకు సెలవు చెబుతోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 19 రోజుల పాటు.. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఉదయం 10గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని నల్లగొండకు తరలిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించిన తర్వాత.. ఆమె పార్థివదేహాన్ని నల్లగొండ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.
Read More : Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
మల్లు స్వరాజ్యం మృతి పట్ల.. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి తుంగతుర్తి కేంద్రంగా నిలిచిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం కేసీఆర్. ఆమె మరణవార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సిద్దాంతాలు వేరయినా.. పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ సాయుధ పోరాటంతో పేదల పక్షాన పోరాటం చేసిన చైతన్య దీపిక మల్లు స్వరాజ్యమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Read More : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. 1978, 1983లో సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. మల్లు స్వరాజ్యం సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.