భార్య చెల్లిని కూడా పెళ్లి చేసుకుని మూడో యువతితో కాపురం

Illegal Affairs: కట్టుకున్న భార్య కాకుండా ఆమె చెల్లిపైనా కన్నేశాడు. బలవంత పెట్టి భార్య చెల్లికి కూడా మూడు ముళ్లు వేసేశాడు. నలుగురు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి మొదటి భార్యకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో చెల్లిని కాపురానికి రానివ్వకుండా అడ్డు చెప్పింది భార్య. చెల్లితో పాటు వస్తేనే ఇంటికి రావాలని లేదంటే వద్దని భార్యను పిల్లలతో సహా గెంటేశాడు.

ఆర్మూర్ మండలం మగ్గిడికి చెందిన హారికకు.. నిజామాబాద్ విద్యుత్ నగర్‌కు చెందిన గల్ఫ్ ఏజెంట్ కృష్ణాకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నలుగురు పిల్లలు పుట్టాక హారిక చెల్లెలిపై కన్నేసిన కృష్ణ ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తన చెల్లితో పాటు మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడని హారిక ఆరోపించింది.

అక్కచెల్లెలు(ఇద్దరు భార్యలు) ఇంటికి రాకుండా మొండికేయడంతో మరో మహిళను తీసుకొచ్చి ఇంట్లో కాపురం చేస్తున్నాడు. భర్త చెప్పినట్లుగానే తన చెల్లిని వెంట పెట్టుకుని వచ్చిన భార్యకు షాక్ తగిలింది. వీరిద్దరిని కాదని మరో మహిళను వివాహం చేసుకుని తెలిసి షాక్ అయ్యారు.

దీంతో ఆగ్రహించిన మహిళ, తన చెల్లి, నలుగురు పిల్లలతో కలిసి న్యాయం చేయాలంటూ ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఆమె నిరసనకు మహిళా సంఘాలు మద్దతు తెలియజేశాయి. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ది చేశారు. ఈ ఘటన నిజామాబాద్‌లోని విద్యుత్‌ నగర్‌ ప్రాంతంలో మంగళవారం జరిగింది.

హారికతో పాటు ఆమె చెల్లి కూడా అక్క ఆందోళనకు మద్దతు తెలుపుతూ కృష్ణ ఇంటిముందు ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు విచారిస్తున్నారు.