Bandlaguda Laddu Auction : రికార్డులన్నీ బ్రేక్.. బండ్లగూడజాగీర్‌లో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూ.. బాబోయ్.. అన్నికోట్లా..!
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాసులు ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూ వేలం రికార్డు స్థాయి ధర పలికింది.

Bandlaguda Laddu Auction
Bandlaguda Laddu Auction : హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాసులు ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూ వేలం రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది ఇదే కమ్యూనిటీలోని గణనాథుడి వద్ద లడ్డూ వేలంలో రూ.1.87కోట్లు పలికింది. ప్రస్తుతం జరిగిన వేలంలో ఆ రికార్డు బద్దలైంది.
కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణనాథుడి వద్ద ఉంచిన 10కేజీల లడ్డూను శుక్రవారం వేలంపాట నిర్వహించారు. రాత్రి 8.15గంటలకు వేలంపాట ప్రారంభమై రాత్రి 10.40 వరకు సాగింది. ఈ వేలంలో విల్లాలోని నివాసితులు మాత్రమే పాల్గొంటారు. ఈ లడ్డూను దక్కించుకునేందుకు కమ్యూనిటీలోని సభ్యులు పోటీపడ్డారు. మొత్తం 80 విల్లా ఓనర్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కిపైగా బిడ్లతో ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ వేలంపాట సాగడం గమనార్హం. చివరికి లడ్డూను రూ.2.32 కోట్లకు దక్కించుకున్నారు. గతకంటే రూ.45లక్షలకు అదనంగా ఈసారి లడ్డూ ధర పలికి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బును 42ఎన్టీజీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్టు ద్వారా 10వేల మందికి సాయం అందుతోంది. ప్రతీపైసా నేరుగా క్షేత్ర స్థాయిలోకే వెళ్తుందని తెలిపారు. అయితే, గణపతి లడ్డూను ఎవరు దక్కించుకున్నా.. విల్లాలోని అన్ని కుటుంబాలు కలిసే పంచుకుంటాయని నిర్వాహకులు చెప్పారు.
2018లో కేవలం రూ.25,000తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం, ఇప్పుడు తెలంగాణలో అత్యంత ఖరీదైన లడ్డూ వేలంలలో ఒకటిగా ఎదిగింది. 2019లో రూ.18.75 లక్షలు, 2020లో రూ.27.3 లక్షలు, 2021లో రూ.41 లక్షలు, 2022లో రూ.60 లక్షలు లడ్డూ ధర పలికింది. 2023లో ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది. 2024లో 1.87కోట్లు పలికిన లడ్డూ ధర.. ప్రస్తుతం 2025లో రూ. 2.32 కోట్లు పలికి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Richmond Villas Ganesh Laddu fetches ₹2.32 crore
At the Ganesh Utsav celebrations in Richmond Villas, Bandlaguda Jagir, the traditional laddu auction drew wide attention. This year, the laddu was auctioned for ₹2.32 crore.
Residents and devotees participated actively in the… pic.twitter.com/yHoSV2h8sS
— Sudhakar Udumula (@sudhakarudumula) September 5, 2025