Telangana Heavy Rain : తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సమీప ప్రాంతంలో ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇదిలాఉంటే..
ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే వారంరోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా చాన్స్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. హైదరాబాద్‌లో వర్షాలు దంచికొండుతున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వేళల్లోకూడా వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది.
పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టలో వర్షం కురిసింది. బహదూర్‌పురా, గౌలిగూడ, శాలిబండ, సైదాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, యూసుఫ్‌గూడలో వర్షం ముంచెత్తింది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్‌పేట్‌లో వర్షం కురిసింది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. శనివారం సాయంత్రం, రాత్రివేళల్లో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో వర్షపాత గణాంకాలు కాస్త పెరిగాయి. గురువారం ఉదయం వరకు 11శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ఈనెల 8వ తేదీ నాటికి రాష్ట్రంలో 41.58 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 39.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం 8.30గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుత నైరుతి సీజన్ లో ఇదే అతిపెద్ద వర్షమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 22 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.