Rain Alert : తెలంగాణలో మరోసారి అతిభారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..

Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rain Alert

Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read: బీజేపీలో కల్వకుంట్ల కవితను చేర్చుకుంటారా? ఎంపీ అర్వింద్ సమాధానం ఇదే..

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకోగా.. పోలీసులు, రెస్క్యూ బృందాలు తాళ్లతో సురక్షితంగా బయటకు లాగారు.

ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం వర్షం దంచికొట్టింది. అయితే, వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోసహా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు పాటించాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరగా ఉండొద్దని అధికారులు సూచించారు.