Telangana Rains : వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారంరోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- July 6, 2026 / 07:05 AM IST
Telangana Rains
- తీరందాటిన వాయుగుండం
- తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీనికితోడు చురుకైన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Telangana Govt : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ ఏడాది బోనస్ ఇచ్చేది వీళ్లకే.. గడువులోపు నమోదు చేసుకోవాలి..
నైరుతి రుతుపవనాల సీజన్లో మొదటి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి.. రాత్రికి ఒడిశాలోని బాలాసోర్‌కు సమీపంలో తీరం దాటింది. రాబోయే 24గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ వాయుగుండం కారణంగా తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు (సోమవారం) అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం రోజంతా నగరంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటిపూట తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా జల్లులు పడే అవకాశం 45 శాతం వరకు ఉందని, రాత్రి వేళల్లో ఈ అవకాశం 10 శాతానికి తగ్గుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
