Telangana Govt : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఈ ఏడాది బోనస్ ఇచ్చేది వీళ్లకే.. గడువులోపు నమోదు చేసుకోవాలి..
sanna vadlu bonus registration 2026 : వడ్లకు ప్రకటించిన బోనస్ అమలులో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
sanna vadlu bonus registration 2026
sanna vadlu bonus registration 2026 : వడ్లకు ప్రకటించిన బోనస్ అమలులో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. 2026 వానాకాలం సీజన్లో సాగుచేసే రైతులకు బోనస్ అందించేందుకు విత్తనాల కొనుగోలు, సాగు వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. వ్యవసాయశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు సన్న వరి రకాలకే బోనస్ వర్తించనుంది. దీంతో రైతులు, విత్తన డీలర్లు నిర్దేశించిన విధంగా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..
రైతులకు సన్న వరి విత్తనాలు విక్రయించిన వెంటనే విత్తన డీలర్లు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకోసం https://seedsgrowerp.com/seedsales/login.php వెబ్సైట్లో లాగిన్ అయి ప్యాడీ ఫైన్ వెరైటీ సేల్స్ (Paddy Fine Variety Sales) ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేసి సమర్పించాలి. డీలర్లకు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా పోర్టల్ లోకి ప్రవేశించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. నమోదు సమయంలో రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నంబర్, విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, డీలర్ వివరాలు, కొనుగోలు తేదీ, విత్తన ప్యాకెట్ పరిమాణం వంటి వివరాలు నమోదు చేయాలి.
డీలర్ల వద్ద విత్తనాలు కొనకుండా , గత పంట నుంచి విత్తనాలు సిద్ధం చేసుకొని సాగు చేసే రైతులు కూడా బోనస్ కు అర్హులు. అయితే, అలాంటి రైతులు తమ గ్రామంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ని సంప్రదించి సాగు వివరాలను నమోదు చేసుకోవాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ లో సన్న వరి నమోదుకోసం ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షేత్ర స్థాయిలో ఏఈఓలు రైతుల సాగు వివరాలను యాప్ ద్వారా నమోదు చేయనున్నారు.
ఈ ఏడు రకాలకే బోనస్..
ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఈ సన్న వరి రకాలకే వర్తిస్తుంది.
ఆర్ఎన్ఆర్-15048 (RNR-15048), బీపీటీ-5204 (BPT-5204), కేఎన్ఎం-1638 (KNM-1638), హెచ్ఎంటీ సోనా (HMT Sona), జై శ్రీరామ్ (Jai Sriram), డబ్ల్యూజీఎల్-44 (WGL-44), కేఎన్ఎం-7715 (KNM-7715). అయితే, వ్యవసాయ శాఖ సూచించిన గడువులోపు నమోదు పూర్తి చేసిన రైతులకే సన్న వడ్ల బోనస్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
