Rain Alert
Rain Alert : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయినప్పటికీ.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ (శనివారం) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే చాన్స్ ఉన్న కారణంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి ఉండొద్దని సూచించింది.