Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడేనా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంత‌టితో స‌ద్దుమ‌ణుగుతుందా? మునుముందు కొత్త ప‌రిణామాల‌కు దారి తీస్తుందా అనేది చూడాలి.

Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడేనా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

Updated On : October 17, 2025 / 8:49 PM IST

Konda Surekha: టెండర్‌ వార్‌ నుంచి..ఓఎస్డీ తొలగింపు వరకు..డాటర్ సీరియస్ అలిగేషన్స్‌ టు..ఏఐసీసీ ఇంచార్జ్‌కు మంత్రి కంప్లైంట్‌ వరకు..ఎపిసోడ్‌ అంతా ఉపరితల ఆవర్తనంగా మారింది. కొండంత వాయుగుండం కాస్త అధిష్టానం దగ్గరకు చేరి..ఏం చేద్దామనే దానిపై అక్కడ సుడిగుండం తిరుగుతోంది. అయితే ఇష్యూను ఎలా తీరం దాటించాలనే దానిపై పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారట. భార‌మంతా హైకమాండ్‌ మీదే వేసిన కొండా..ఎట్లైతే గట్లాయే అని వెయిట్ అండ్ సీ అంటున్నారట. ఇంత‌కు కొండంత రచ్చపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది.? ప్యాచప్‌ అయి రచ్చకు ఎండ్‌కార్డ్‌ పడేనా.?

మేడారం టెండర్‌ వార్‌తో రచ్చ స్టార్ట్‌ అయింది. ఓఎస్డీ తొలగింపు పెద్ద దుమారమే లేచింది. ఆ ఓఎస్డీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లడం మరింత రచ్చరంబోలా అయింది. కొండా సురేఖ కూతురు సుస్మితా ప‌టేల్ కామెంట్స్‌ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని, ఆయన బ్రదర్స్‌ను టార్గెట్‌ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి.

ఆఖ‌రికి మంత్రి కొండా సురేఖ..క్యాబినెట్ స‌మావేశానికి కూడా డుమ్మా కొట్టడంతో హీట్ మ‌రింత పెరిగింది. క్యాబినెట్ మీటింగ్‌ కూడా ప‌క్కన పెట్టి కొండా సురేఖ త‌న కూతురు సుస్మిత‌తో క‌లిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కల‌ను క‌లిసి త‌న ఆవేద‌న‌ను వ్యక్తం చేశారు. మేడారం టెండ‌ర్లు, ద‌క్కన్ సిమెంట్ ఎపిసోడ్‌, త‌న శాఖ‌లో జ‌రుగుతున్న వ్యవ‌హారాలపై మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు వివ‌రించార‌ట‌ కొండా సురేఖ. ఓఎస్డీ సుమంత్ విష‌యంలో ప్రభుత్వం తీరుతో పాటు.. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీ నేత‌లంతా క‌లిసి త‌న‌ను ఒంట‌రిని చెప్పుకున్నారట.

పిల్లలు ఎంట‌ర్ కావ‌డం సరైంది కాదని మందలింపు..

ఈ స‌మావేశం చివ‌రిలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కూడా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్‌ను పీసీసీ చీఫ్ తప్పుబట్టారట. అయితే వ‌రుస‌గా ప‌రిణామాల‌తో ప్రెజ‌ర్ వ‌ల్లే అలా మాట్లాడాల్సి వ‌చ్చింద‌ని సుస్మిత చెప్పారట. ఏదేమైనా పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల పిల్లలు ఎంట‌ర్ కావ‌డం సరైంది కాదన్నట్లుగా మ‌హేష్ కుమార్‌ గౌడ్ మందలించారట. ఇక కొండా సురేఖ కూడా చెప్పాల్సిన విష‌యాల‌న్ని చెప్పి..పార్టీ పెద్దల‌పైనే భారం వేస్తున్నామ‌ని..ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పార‌ట‌.

మంత్రి కొండా సురేఖ ఆవేద‌న‌తో పార్టీ పెద్దలు కూడా అసలేం ఏం జ‌రిగిందనే దానిపై ఆరా తీస్తున్నారట. సీఎం రేవంత్‌తో కూడా మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి మాజీ ఓఎస్డీ ఏమైనా త‌ప్పులు చేస్తే చ‌ట్టప్రకారం ముందుకెళ్లాలి కానీ..మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం క‌రెక్ట్ కాద‌ని చెప్పారట. అయితే ప్రభుత్వ పెద్దలు కూడా మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం త‌మ‌కు తెలియ‌కుండా జ‌రిగిపోయిందని అన్నార‌ట‌. సుమంత్ ఫోన్ ట్రేస్ చేయ‌డంతో లొకేష‌న్ ఆధారంగా వెళ్లార‌ని..అది మంత్రి సొంత ఇళ్లని తెలియ‌క ఇదంతా జ‌రిగిపోయింద‌న్నట్లుగా చెప్పుకొచ్చారట.

గ్యాప్‌ను స‌రిచేసేందుకు పెద్దల ప్రయత్నాలు..

ఇక‌ తన విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకు కాస్త మ‌న‌స్తాపం చెందిన కొండా సురేఖ..క్యాబినెట్ స‌మావేశానికి కూడా వెళ్లకుండా..ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్‌పై ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త గుర్రుగా ఉన్నార‌ట‌. దీంతో సురేఖ‌కు ప్రభుత్వ పెద్దల‌కు మధ్య గ్యాప్‌ను స‌రిచేసేందుకు పార్టీ ఇంచార్జ్ మీనాక్షితో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అన్నీ స‌ర్దుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ‌, ముఖ్యనేత‌లు భేటీ కావాల‌ని భావిస్తున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన‌ట్లు మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఒక‌ట్రెండు రోజుల్లో ఎండ్‌కార్డ్‌ వేయబోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ కోసం పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ ప్రయ‌త్నాలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ పెద్దల జోక్యంతో ఇష్యూ ఇంత‌టితో స‌ద్దుమ‌ణుగుతుందా? మునుముందు కొత్త ప‌రిణామాల‌కు దారి తీస్తుందా అనేది చూడాలి.

Also Read: నేను కూడా సీఎం అభ్యర్థి అవుతా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..