Minister Damodara Raja Narasimha (Photo : Facebook)
అసలైన తెలంగాణా ఇప్పుడొచ్చింది అని అన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇన్నాళ్ళు కన్న స్వప్నాలు నిజం కాబోతున్నాయని చెప్పారు. పేదవానికి మంచి పాలన అందివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తామని, ఒక మంచి పాలసీని తీసుకొస్తామని వివరించారు. వైద్య రంగంలో 23 ఉపశాఖలు ఉన్నాయని, వాటిని బలోపేతం చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలుచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పలేదని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సమిష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహ లక్ష్మీ పథకాన్ని(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) అమలు చేశామన్నారు.
Also Read : తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం : మంత్రులు
వంద రోజుల్లో మిగతా నాలుగు హామీలను కూడా అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారాయన. ఆందోల్ కు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ‘ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడూ తప్పలేదు. ఆచరణ యోగ్యమైన పథకాలనే కాంగ్రెస్ ప్రకటించింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని నమ్మే పార్టీ కాంగ్రెస్. 6 గ్యారెంటీలలో ఇప్పటికే రెండు అమలు చేశాం. రాబోయే రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం.
ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమష్టిగా డెసిషన్ తీసుకుంటాము. అసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చింది. స్వేచ్చ, కమిట్ మెంట్, దార్శనికత, స్వాప్నికం అన్నీ ఇప్పుడు వచ్చాయి. రాబోయే కాలంలో తెలంగాణ ఎలా ఉండాలి, ఆర్థిక అసమానతలు ఏ విధంగా తగ్గాలి, విద్య, వైద్యం, సామాజిక భద్రత ఏ రకంగా కల్పించాలి అనే తపన కాంగ్రెస్ పార్టీకి ఉంది’ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Also Read : ఒక్క క్రిమినల్ కూడా లేని ముగ్గురు తెలంగాణ మంత్రులు వీరే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. దీంతో అధికారం వచ్చాక గ్యారెంటీలు అమలు చేసే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పుటికే రెండు గ్యారెంటీలు అమలు చేసింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు.