Telangana ministers : తెలంగాణలో ముగ్గురు మంత్రులపై క్రిమినల్ కేసుల్లేవు….

తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ రిపోర్టులో తేలింది.....

Telangana ministers : తెలంగాణలో ముగ్గురు మంత్రులపై క్రిమినల్ కేసుల్లేవు….

Telangana ministers

Updated On : December 10, 2023 / 11:33 AM IST

Telangana ministers : తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. 12 మంది తెలంగాణ మంత్రుల్లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సహా 9 మంది మంత్రులపై పలు క్రిమినల్ కేసులున్నాయని తాజా ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ రిపోర్టులో తేలింది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిపైనే అత్యధికంగా 89 పోలీసు కేసులున్నాయి. సీఎంపై నమోదైన క్రిమినల్ కేసుల్లో 50 కేసులు తీవ్రమైనవి.

సీఎంతోపాటు 11 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నేర చరిత్ర లేని క్లీన్ ఇమేజ్ ఉన్న మంత్రులు ముగ్గురు ఉండటం విశేషం. 9 మంది మంత్రులపై 136 కేసులున్నాయి.

ALSO READ : Ayodhya Ram temple : రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై 11 కేసులున్నాయి. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై 7 కేసులు, అనసూయ సీతక్కపై 5 కేసులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీపాదరావుపై 5కేసులున్నాయి. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై 5 కేసులు, మూడు కేసుల చొప్పున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఉన్నాయి.

సీఎంతోపాటు 11 మంది మంత్రులందరూ కోటీశ్వరులే…

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితోపాటు 11 మంది మంత్రులు కోటీశ్వరులని ఏడీఆర్ రిపోర్టులో వెల్లడైంది. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యధికంగా రూ.433.93కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆస్తులే కాదు అప్పుల్లోనూ పొంగులేటి ముందున్నారు. ఈయనకు రూ.43.66 కోట్ల అప్పులున్నాయి. దామోదర్ రాజనర్సింహకు రూ.46.66కోట్ల ఆస్తులున్నాయి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రూ.39.55కోట్ల ఆస్తులున్నాయి.

ALSO READ : Telangana Mlc : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రూ.39.55కోట్ల ఆస్తున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రూ.17.88కోట్లు, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు రూ.11.83కోట్లు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రూ.6.91కోట్లు, కొండా సురేఖకు రూ.5.98 కోట్లు, జూపల్లి కృష్ణారావుకు రూ.3.18 కోట్ల ఆస్తులున్నాయి. మంత్రుల్లో దాసరి అనసూయ సీతక్కకు కేవలం రూ.83.83లక్షల ఆస్తులున్నాయి. దీంతోపాటు రూ.24.74 లక్షల అప్పులున్నాయి.