లాస్య నందిత అకాల మరణం చాలా బాధాకరం: మంత్రి కోమటిరెడ్డి

రోడ్డు ప్రమాదానికి గురై చిన్నవయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy Venkatareddy: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చాలా బాధాకరమని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ ఆస్పత్రి వద్ద లాస్య నందిత భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి మాదిరిగానే జనాల్లో ఉండి పనిచేశారు. నాలుగు రోజుల క్రితమే తండ్రి సంవత్సరికం చేశారు. అంతలోపే లాస్య నందిత చనిపోవడం బాధాకరం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామ”ని తెలిపారు.

గాంధీ ఆస్పత్రిపై మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సౌకర్యాలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కాన్ఫరెన్స్ హాల్, సూపరింటెండెంట్ రూమ్ మాత్రమే నీట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ డ్రైనేజ్ లీక్ అవుతోంది. సీఎంతో చర్చించి గాంధీ ఆస్పత్రి దుస్థితి మారుస్తాం. త్వరలో ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తామ”ని చెప్పారు.

ఈరోజే అంత్యక్రియలు..
లాస్య నందిత మృతదేహానికి ఈరోజే అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. ఆమె తండ్రి సాయ్యన్నకు అంత్యక్రియలు జరిగిన ఈస్ట్ మారేడిపల్లి స్మశానవాటికలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాస్య నందితకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎవరు అంత్యక్రియలు చేస్తారనేదానిపై క్లారిటీ లేదు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన తర్వాత లాస్య నందిత భౌతికకాయాన్ని కార్కానాలోని ఆమె ఇంటికి తరలించారు.

Also Read: లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

లాస్య నందిత ఇంటికి బీఆర్ఎస్ నేతలు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. లాస్య నందిత ఇంటికి చేరుకుని ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. లాస్య నందిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆమె ఇంటికి పలువురు బీఆర్ఎస్ నేతలు తరలివస్తున్నారు. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి తదితరులు లాస్య నందిత ఇంటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా లాస్య నందిత నివాసానికి రానున్నారు.

ట్రెండింగ్ వార్తలు