లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

Cantonment MLA Lasya Nanditha

Lasya Nandita  : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్, ఎమ్మెల్యే ఉన్నారు. అతివేగమే కారు ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్న లాస్య నందిత.. సీటుబెల్టు పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారు. సీటు బెల్టు పెట్టుకొనిఉంటే ఆమె గాయాలతో బయటపడి ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లాస్య నందిత మరణించగా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. అతని పరిస్థితికూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read : Lasya Nanditha : కారు ప్రమాదంలో కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు..
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న మృతితో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే, గత ఏడాది కాలంలో పలు సార్లు ఆమె ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు దూసుకెళ్తింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగలగొట్టి లాస్య నందితను బయటకు తీసుకొచ్చారు.

ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈనెల 14న నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరై వస్తుండగా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆమె స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటన జరిగి పదిరోజులు గడవక ముందే శుక్రవారం తెల్లవారు జామున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. రెండు సార్లు మృత్యువు నుంచి తప్పించుకున్న లాస్య నందిత.. మూడోసారి కారు ప్రమాదంలో మృతిచెందింది.

Also Read : Lasya Nanditha : లాస్య నందిత మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్

ఫిబ్రవరి నెలలోనే..
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని గత ఏడాదికాలంగా మృత్యుఘంటికలు వెంటాడుతున్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. సరిగ్గా ఏడాది తరువాత సాయన్న మృతిచెందిన ఫిబ్రవరి నెలలోనే కూతురు లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను, నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇదిలాఉంటే లాస్య నందిత రోడ్డు ప్రమాదంపై అమీర్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు.