Lasya Nanditha : లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Lasya Nanditha : లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్

Lasya Nanditha

Revanth Reddy : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారు జామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై కారు ప్రమాదంలో మృతిచెందారు. కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లాస్య నందిత మరణించగా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ నియోజకవర్గంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. లాస్య నందిత మృతివార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Also Read : Lasya Nanditha : కారు ప్రమాదంలో కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

అత్యంత విషాదకరం
లాస్య నందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని, ఆయన గతఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ రేవంత్ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : కరెంటోళ్లు జాగ్రత్త.. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

కేసీఆర్ దిగ్భ్రాంతి 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య నందిత మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఇదిలాఉంటే .. లాస్య నందిత మృతిపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాద కరమైన క్లిష్ట సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బలం చేకూర్చాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. యువ నేతను కోల్పోవడం బాధగా ఉందని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఆమె మరణ వార్త షాక్ కు గురిచేసింది
ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త షాక్ కు గురిచేసిందని.. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా, విధి మరొకటి తలచిందని.. లాస్య నందిత కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి బాధాకరమని, ఒకే కుటుంబంలో ఏడాది వ్యవధిలో ఇద్దరు సభ్యులను కోల్పోవటం విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రేయోభిలాషులు, స్నేహితుల నుండి వస్తున్న ప్రేమ, మద్దతు ఆ కుటుంబానికి బలాన్ని చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ప్రముఖుల సంతాపం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాలమరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, చింతా ప్రభాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్
తదితరులు సంతాపం తెలిపారు.

ఆస్పత్రికి వెళ్లిన హరీశ్ రావు
ఇదిలాఉంటే లాస్య నందిత మృతి వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆస్పత్రికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లాస్య నందిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె పార్ధీవ దేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు, నివాసం వద్దకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి పర్యాంతంతో విషాదం ఛాయలు అలముకున్నాయి.