Talasani
Minister Talasani: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఎవరితోనూ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అంశాలపై స్పందించేందుకు చాలా సమయం ఉందని చెప్పారు. తాము సంపూర్ణ మెజారిటీ తో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎవరిపైనా ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందని అన్నారు.
గతంలో ఎన్నో ఏళ్లుగా అంబర్ పేటకు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ నియోజకవర్గ అభివృద్ధిపై తమ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం చర్చకు సిద్ధంగా ఉన్నారని.. కిషన్ రెడ్డి సిద్ధమా? అని నిలదీశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వస్తారా? లేదా? అనేది ఆయనకే తెలియాలని చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, అయితే, తమ సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదని అన్నారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థను ఎలా నడుపుతోందో దేశం అంతటా గమనిస్తోందని చెప్పారు. సెక్రటేరియట్ కట్టడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని అన్నారు. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్ లో అందరికి తెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై వాళ్ల పార్టీ నేతలు ఏం అంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో ఎంపీగా ఉండి… బీజేపీకి ఓట్లు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని చెప్పారు.