Tummala Nageswara Rao with Union Agriculture Minister Shivraj Singh Chouhan
Telangana : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాలు పెంచాలని కోరారు. అదేవిధంగా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వీలుగా నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్ (ఎన్‌పీకేఎస్)లపై ఇచ్చే రాయితీలను పెంచాలని కోరారు.
ప్రస్తుతం యూరియాపై ఇస్తున్న స్థాయిలో ఎన్‌పీకేఎస్ ఎరువులపై రాయితీలు ఇవ్వడం లేదని, ఎన్‌పీకేఎస్ ఎరువులపై రాయితీలను యూరియాతో సమాన స్థాయికి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని తుమ్మల కోరారు. అయితే, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తుమ్మల మరో కీలక విజ్ఞప్తి చేశారు.
దేశ వ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో రైతులకు చేయూతనిచ్చి దిగుబడులు పెంచడానికి కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన (PM Dhan Dhaanya Krishi Yojana) లో తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను చేర్చాలని తుమ్మల కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. పూర్తిగా వర్షాలపై ఆధారపడిన ఈ జిల్లాల్లో పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉంటోంది. వీటిని ధనధాన్య యోజనలో చేర్చితే ఆ జిల్లాల రైతులకు వ్యవసాయం గిట్టుబాటుగా మారుతుందని తుమ్మల అన్నారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో రైతులకు చేయూతనిచ్చి దిగుబడులు పెంచడానికి ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు. రూ.24వేల కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికింద 1.7కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. పంటల మార్పిడి, సాగునీటి సౌకర్యాల కల్పన, నిల్వ సామర్థ్యం పెంపు, విలువ జోడింపు ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.