Komatireddy Raj Gopal Reddy
Komatireddy Raj Gopal Reddy : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇలాంటి సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి రూల్స్ పెట్టారు. అవి తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెప్పారు. అంతేకాకుండా.. టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
తాను పెడుతున్న షరతులు మద్యం షాపులకు టెండర్లు వేసేవారిని ఇబ్బంది పెట్టడానికి కాదని.. తన నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం బాగుపడితే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, ఇంట్లో యాజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను మద్యానికి వ్యతిరేకం కాదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిమీద తాగుతూ తాగుడుకు బానిసలుగా మారుతున్న విధానానికి మాత్రం వ్యతిరేకమని చెప్పారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఏం చేస్తున్నాయంటే?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో కొత్తగా వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి కీలక సూచనలు చేశారు.
వైన్ షాపులు ఊరికి బయట మాత్రమే ఉండాలి. వైన్ షాపుకు అనుబంధంగా సిట్టింగ్ నడపొద్దు. అదేవిధంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దు. వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు. వైన్ షాపు ఓనర్లు సిండికేట్ అయ్యి ఇష్టారీతిలో ధరలు పెంచితే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అంతేకాక.. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, తదుపరి నష్టపోకూడదని మనవి చేస్తున్నాం అంటూ ప్లెక్సీల్లో పొందుపర్చారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే మా ఉద్దేశమని ప్లెక్సీల్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సూచనతో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు సోమవారం నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో తాను విధించిన కొత్త రూల్స్ గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.