రోజురోజుకు రచ్చకెక్కుతోన్న జగిత్యాల జగడం.. ఎమ్మెల్యే పేరెత్తితే చిర్రెత్తిపోతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉండ‌గానే ప‌రిస్థితి ఇలా ఉంటే.. వ‌చ్చే మార్చిలో ప‌ద‌వి నుంచి దిగిపోయాక ఇక తననెవరు ప‌ట్టించుకుంటారంటూ ఆవేద‌న చెందుతున్నారట జీవన్‌రెడ్డి.

MLC Jeevan Reddy

జీవన్‌రెడ్డి.. గత నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల కాంగ్రెస్‌ కు పెద్దదిక్కు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ పవర్‌లోకి వచ్చింది. ఆయన మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ కాంగ్రెస్‌ గూటికి చేరారు. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి కంఫర్ట్‌గా ఫీల్ అవడం లేదు. సీనియర్‌ లీడర్‌ను..పైగా ఎమ్మెల్సీగా ఉన్నా..తనను కాదని ఇంకో ఎమ్మెల్యేను చేర్చుకుంటారా అని అప్పట్లో రగిలిపోయారు. అటోఇటో పార్టీ సర్ధిచెప్పడంతో కాస్త కూల్ అయినట్లే కనిపించినా లేటెస్ట్‌గా ఆయన అనుచరుడి హత్యతో బరస్ట్‌ అయిపోయారు జీవన్‌రెడ్డి. పార్టీ పెద్దలు లైన్‌లోకి వచ్చి మాట్లాడినా చల్లబడలేదు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి మర్డర్ అగ్గిరాజేసింది. ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మధ్య మరోసారి గొడవకు దారి తీసింది. ఈ హత్య వెనుక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం ఉందనేలా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు కాకపుట్టిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

ఈ మర్డర్ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని..ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు డాక్టర్ సాబ్. లేటెస్ట్‌ ఎపిసోడ్‌తో జగిత్యాల కాంగ్రెస్‌లో ఏం జరగబోతోంది.? దీనిని సీరియస్‌గా తీసుకుంటున్న జీవన్‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా..అనేది ఉత్కంఠగా మారింది.

జీవన్‌ రెడ్డి అసహనం
పార్టీలో 40 ఏళ్లుగా ప‌నిచేస్తున్నందుకు త‌న‌కు మంచి బుద్ది చెప్పారంటూ విప్ అడ్లూరి లక్షణ్ కుమార్‌పై సీరియ‌స్ అయ్యారు జీవన్‌రెడ్డి. ఆయనను స‌ముదాయించ‌డం కోసం స్వయంగా పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి మాట్లాడే ప్రయ‌త్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ని పార్టీలో చేర్చుకోవడంపైనా.. ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనా పీసీసీ చీఫ్‌ను ఫోన్‌లోనే నిలదీస్తూ..అంద‌రూ చూస్తుండ‌గానే ఫోన్ విసిరి కొట్టారట జీవన్ రెడ్డి.

అయితే సంజయ్‌ పార్టీలోకి వ‌చ్చే టైమ్‌లోనే జీవ‌న్ రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని హ‌డావుడి చేశారు. అప్పుడు జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రి శ్రీధ‌ర్‌బాబులు వెళ్లి స‌ముదాయించారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి పిలిపించి పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాలు మాట్లాడి సర్ధిచెప్పారు. నెల రోజుల కింద గాంధీభ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఘ‌ట‌న కూడా చర్చనీయాంశం అయింది. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మావేశానికి జ‌గిత్యాల ఫిరాయింపు ఎమ్మెల్యే సంజ‌య్‌కుమార్ పేరును జాబితాలో ఉంచి..పార్టీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి పేరును చేర్చలేదు.

దీంతో జీవ‌న్‌రెడ్డి తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు. పార్టీ తీరుపై స‌మావేశంలో సీరియ‌స్ కావ‌డంతో.. జ‌రిగిన పొర‌పాటుపై పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మ‌హేశ్‌ గౌడ్‌సర్దిచెప్పారు. ఇవన్నీ ఒకత్తైతే నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మాటే ఎక్కువ‌గా చెల్లుబాటు అవుతుండ‌టం కూడా జీవ‌న్‌రెడ్డికి నచ్చడం లేదట. పోలీస్‌, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వడం..ఎమ్మెల్సీగా ఉన్న జీవ‌న్‌రెడ్డికి మింగుడు పడటం లేదంటున్నారు. కాంగ్రెస్ అంటే జీవన్‌రెడ్డి..జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనేలా జగిత్యాలలో వ్యవహారం నడపిన ఆయనకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట. దీంతో జీవ‌న్ రెడ్డిలో రోజురోజుకూ కాంగ్రెస్‌పై..ఆ పార్టీ పెద్దలపై అసహనం పెరిగిపోతోందనే టాక్ వినిపిస్తోంది.

అగ్నికి ఆజ్యం..
ఎమ్మెల్సీ ప‌ద‌విలో ఉండ‌గానే ప‌రిస్థితి ఇలా ఉంటే.. వ‌చ్చే మార్చిలో ప‌ద‌వి నుంచి దిగిపోయాక ఇక తననెవరు ప‌ట్టించుకుంటారంటూ ఆవేద‌న చెందుతున్నారట జీవన్‌రెడ్డి. ఇదే సమయంలో త‌న ముఖ్య అనుచ‌రుడి మ‌ర్డర్‌తో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అయితే ఈ ఎపిసోడ్‌ను సెట్ రైట్ చేసే బాధ్యతను మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు అప్పగించారు పీసీసీ చీఫ్. అయితే జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలగనివ్వమంటున్నారు శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామని.. ఎవరు మర్డర్‌ చేసినా..దాని వెనక ఎవరున్నా వదిలేది లేదని..ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.

ఈ వివాదానికి ఎండ్‌ కార్డ్‌ పడితే తప్ప జగిత్యాల కాంగ్రెస్‌లో దమారం తగ్గేలా కనిపించడం లేదు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ జీవన్‌రెడ్డి తన వెర్షన్ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్‌ప్రాధాన్యం తగ్గిస్తేనే జీవన్‌రెడ్డి కూల్‌ అవుతారు.. తనపై ఆరోపణలు చేసిన జీవన్‌ రెడ్డిపై యాక్షన్‌ తీసుకుంటే సంజయ్‌ మెత్తబడతారు. ఇదిప్పుడు కాంగ్రెస్‌ పెద్దలకు ప్రాణసంకటంగా మారింది. ఒకరేమో పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న నేత…మరొకరేమో కాంగ్రెస్‌ పై నమ్మకంతో పార్టీలో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే. మరి పార్టీ పెద్దలు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారో… ఎవరిని ఎలా చల్లబరుస్తారో చూడాలి.

మాజీ సీఎం టార్గెట్‌గా లిక్కర్ లింకులు తేల్చే ప్లాన్..!