Kavitha: కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడం ఏంటని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోము అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. జ్యుడీషియల్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు కవిత.
జూన్ 4న మహాధర్నా చేయబోతున్నామని కవిత తెలిపారు. జూన్ 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసన చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందన్నారు కవిత. శనివారం సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇక జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే మహాధర్నా కార్యక్రమ పోస్టర్ ను కవిత రిలీజ్ చేశారు. అనంతరం కేసీఆర్ కు నోటీసులా.. సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి 18 సంవత్సరాలు కావొస్తోంది. తెలంగాణ సమాజంలోని ప్రతి వ్యక్తి తలలో నాలుకలా, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలా జాగృతి సంస్థ కలిసి ఉంది. ఆనాడు ఇద్దరు వ్యక్తులతో పుట్టింది జాగృతి. ఒకరు కేసీఆర్, మరొకరు ప్రొఫెసర్ జయ శంకర్. రాజకీయ రంగంలో తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారని జయ శంకర్ చెప్పారు. అప్పుడే తెలంగాణ జాగృతి ఊపిరి పోసుకుంది. ఇప్పటివరకు అశోక్ నగర్ లో తెలంగాణ జాగృతి కార్యాలయం ఉండేది. ఈరోజు జాగృతి కార్యాలయం బంజారా హిల్స్ కి షిఫ్ట్ అయింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా.
Also Read: కవిత లెటర్‌తో బీఆర్ఎస్‌లో దుమారం.. అయినా కేసీఆర్ మౌనం.. సార్ సైలెన్స్ వ్యూహాత్మకమా?
”తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అద్భుతంగా పాలన జరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏనాడు జై తెలంగాణ అనలేదు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న జై తెలంగాణ అనాలి. రాజీవ్ యువ వికాసం అని జూన్ 2 తారీకున కొత్త పథకం తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? తెలంగాణ యువ వికాసం అని పేరు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణ నీళ్లు తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు. తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి పని చెయ్యడం లేదు. పక్క రాష్ట్రం వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. కేవలం చంద్రబాబు డైరెక్షన్ లో నీటి వాటా విషయంలో అన్యాయం జరుగుతోంది. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నాలుగేళ్ల నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు నోటీసు ఇచ్చారా? తెలంగాణ జాతిపితకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే. జూన్ 4న మహాధర్నా చేయబోతున్నాం. తెలంగాణ సమాజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరిస్తాం. బీసీ బిల్లు గురించి ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడటం లేదు.
బీజేపీ వాళ్లకి హెచ్చరిక చేస్తున్నాం. కేంద్రానికి సెగ తగిలేలా రైలు రోకో కార్యక్రమం చేస్తాం. మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వాలని జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే జాగృతి ఆధ్వర్యంలో ఒక ఎస్సీ విభాగం ఏర్పాటు చేసి ఎస్సీల అభ్యున్నతికి పాటుపడతాం.
కేసీఆర్ కి రెండు కళ్లు. ఒక కన్ను బీఆర్ఎస్, రెండో కన్ను జాగృతి. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోము. గోదావరి జలాల్లో మన వాటా విషయంలో బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు మాట్లాడాలి” అని కవిత డిమాండ్ చేశారు.