Site icon 10TV Telugu

K Laxman: 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇన్ని కేటాయించాం: ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman

BJP MP Laxman

BJP: కేంద్రంలో నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జన సంపర్క్ అభియాన్ (Jan Sampark Abhiyan) చేపడుతున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. మే 30 నుంచి జూన్ 30 వరకు బీజేపీ జన సంపర్క్ అభియాన్ నిర్వహిస్తామని వివరించారు.

బీజేపీ 75 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసేందుకు ఓబీసీ మోర్చా ముందుకు వెళుతుందని తెలిపారు. తెలంగాణలో రూ.4,400 కోట్లు రైల్వేల అభివృద్ధికి కేటాయించామని అన్నారు. రూ. 6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించామని తెలిపారు. కరీంనగర్‌, వరంగల్ పట్టణాలకు స్మార్ట్ సిటీ కింద రూ.1,000 కోట్లు కేటాయించామని చెప్పారు.

మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారత పౌరులకు సరైన గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై లోక్ సభ నియోజక వర్గాలు, రాష్ట్రాల వారీగా నివేదికలు తయారు చేస్తున్నామని తెలిపారు. 9 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి అందిన నిధులు, పథకాల గురించి ఒక నివేదిక తయారు చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు.

రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు?
తెలంగాణలో బీజేపీని మరింత శక్తిమంతం చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. “119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ స్థాయి నుంచి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. కేసీఆర్ ప్రభుత్వం కిసాన్ సర్కార్ నినాదంతో తెలంగాణ ప్రజలను, దేశ ప్రజలను మోసగించే ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తాము.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదు, రెండు ఒకే గూటి పక్షులు. దేశ స్థాయిలో ఈ రెండు పార్టీలు కలసి నడుస్తూ, రాష్ట్రంలో వేరు వేరుగా పోరాడుతున్నట్లు నటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో మరోసారి కలిసే అవకాశం ఉంది. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రెండు పార్టీల కలయిక పై సంకేతాలు, స్పష్టత ఇచ్చారు.

కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీలో చేరడంతో పాటు కలసి పనిచేయాలి. రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదు. బీజేపీ తెలంగాణ నేతల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాము. స్థానిక నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వంతో కలిసి వచ్చే ఎన్నికల్లో వెళతాము.

ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న ఏ పార్టీలు పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరణకు పిలుపునివ్వవు. మోదీపై అక్కసుతో ప్రతిపక్ష పార్టీలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నాయి. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు పార్లమెంటు కు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు” అని చెప్పారు.

YSR Sister Vimalamma : వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ

Exit mobile version