Komatireddy Rajagopal Reddy
Telangana : మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికే చేరుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వెళతారంటూ వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన అఖండ విజయంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి చేరతారనే వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో తననను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారని కానీ తాను బీజేపీని వీడేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ది కోసం రాజీలేని పోరాటం చేశానని..ఈ పోరాటం కోసం తన ఎమ్మల్యే పదవిని కూడా వదులుకుని బీజేపీ చేరానని మునుగోడు ఎన్నికల్లో తిరిగి పోటీ చేసిన ఓడిపోయాను..అయినా బీజేపీని వీడను అంటూ స్పష్టంచేశారు.
కానీ తాను తిరిగి కాంగ్రెస్ లో చేరతున్నానని ప్రచారం చేస్తున్నారని దీంట్లో ఎంత మాత్రం నిజంలేదన్నారు. మా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని కావాలనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలో నేను ఓడిపోయినా నాకు బాధలేదని కానీ రేవంత్ రెడ్డి నాపై కామెంట్లు చేయటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై ఉపఎన్నికలలో దుష్ప్రచారం చేసి నేను ఓటమి చెందేలా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. కర్నాటక ఫలితాల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమేనని కానీ నేను మాత్రం బీజేపీని వీడేది లేదని స్పష్టంచేశారు. కర్నాటక లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణ లో కాంగ్రెస్ లో గెలవాలని లేదన్నారు.
కేంద్రంలో అధికారంలో లేకుండా.. బలమైన నాయకత్వం లేకుండా తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయారయ్యాయనీ..
ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టేశాయి అంటూ ఎద్దేవా చేశారు.
నాకు పదవులు అవసరం లేదన్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని..ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది..తెలంగాణ లో బీజేపీ పుంజుకుంటుందని గెలపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ బీజేపీలో చేరకలు పెద్దఎత్తున ఉంటాయని అన్నారు. నాపై వచ్చే అపవాదుల్ని, దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరుతున్నానంటూ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం సునీల్ బన్సాల్ తో నిన్న రాత్రి గంటకు పైగా చర్చించానని తెలిపారు.బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని..అధ్యక్ష పదవి కోసం ఎవ్వరూ లాబీయింగ్ చెయ్యడం లేదని స్పష్టంచేశారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల సంవత్సరం కాబట్టి బండి సంజయ్‌ను అధిష్టానం కొనసాగిస్తుందని..లేదంటే ఆయనకు వేరే భాధ్యతలు ఇస్తారన్నారు. అంతిమ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని..బిజెపిని బలహీనపరిచే కుట్ర జరుగుతుందనీ అయినా వారి కుట్రలు సాగవని తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.