Muthireddy Yadagiri Reddy
Muthireddy Yadagiri Reddy – BRS: తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ ఇవాళ సిద్దిపేట (Siddipet) జిల్లా కుకునూర్ పల్లి మండలం మంగోల్ శుద్ధీకరణ కేంద్రం వద్ద మంచి నీళ్ల పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ… కాకతీయ రాజులు, రాణి రుద్రమదేవి పాలననే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్ఫూర్తి అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు నీటి సమస్య లేదని తెలిపారు. కరవు ప్రాంతాలకు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.
మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు, తాగునీరు అందించారని తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న గొప్ప సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు.
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనూ నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ దని తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథతో నీటి కష్టాలు పూర్తిగా పోయాయని అన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తోందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని అందించి మహిళల కష్టాలను కేసీఆర్ తీర్చారని చెప్పారు.
ప్రభుత్వ విప్ గొంగడి సునీత మాట్లాడుతూ… భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు గజ్వేల్ కోమటి బండ నుంచి శుద్ధీకరణ చేసిన నీరు సరఫరా అవుతోందని తెలిపారు. యాదాద్రి దేవాలయానికి ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆపిల్ అవార్డు దక్కడం వెనుక కేసీఆర్ కృషి ఎంతగానో ఉందని చెప్పారు.