Rathod Ramesh (Photo : Google)
Rathod Ramesh – Soyam Bapu Rao : ఎంపీ సోయం బాపురావ్ చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ స్పందించారు. ఎంపీ సోయం బాపురావ్ తనపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన అన్నారు. సోయం బాపురావ్ పై నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉందన్నారు. ఆయన నాయకత్వంలో నేను బీజేపీలో చేరానని చెప్పారు.
నేను ఎంపీ టికెట్ ఆశించను అని రాథోడ్ రమేశ్ తేల్చి చెప్పారు. తాను ఖానాపూర్ కే పరిమితం అవుతానని గతంలోనే స్పష్టం చేశానని గుర్తు చేశారు. నా దృష్టి మొత్తం ఖానాపూర్ పైనే, ఆ దిశగా నేను పని చేసుకుంటున్నా అని వివరించారు. ఎంపీ లాడ్స్ గురించి తాను ఎన్నడూ అడగలేదని, ఎక్కడా మాట్లాడలేదని రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు.
మాపై ఆరోపణలు వస్తే పిలిపించుకుని అడిగే హక్కు సోయం బాపురావ్ కి ఉందన్నారు. పక్కనున్న వాళ్ళు ఏదో కల్పించి చెబితే నమ్మడం సరైంది కాదన్నారు. సోయం బాపురావ్ చాలా మంచి వ్యక్తి అని.. అమాయకుడు, వివాదాల్లో తలదూర్చడు అని చెప్పారు.
” పార్టీలో ఉన్న లోపాలను సరిచేస్తూ సోయం ముందుకెళ్లాలి. పేద ప్రజలకు ఎంపీగా సోయం బాపురావ్ చాలా చేస్తున్నారు. లంబాడ, ఆదివాసీ గొడవలో అందరికంటే ఎక్కువగా నేను నష్టపోయాను. నేను ఖానాపూర్ కే అంకింతం. మన ఇద్దరం కలిస్తే.. ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలువొచ్చు” అని రాథోడ్ రమేశ్ అన్నారు.
అసలేం జరిగిందంటే..
తన సొంత అవసరాల కోసం ఎంపీ లాడ్స్ (MPLADS) నిధులను వాడుకున్నానంటూ సోయం బాపురావు స్వయంగా చెప్పినట్లు వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇల్లు కట్టుకోవడానికి, తన కొడుకు పెళ్లి కోసం ఎంపీ నిధులు వాడుకుంటే తప్పేంటి? అని ఆ వీడియో ఉంది. ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఎంపీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై సోయం బాపూరావు స్పందించారు. ఆ వ్యాఖ్యలపై ఆయన స్పష్టతనిచ్చారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు గోల్ మాల్ చేశానని ఆ ఇద్దరు బీజేపీ నేతలు తనను బద్నాం చేశారని మాటల దాడికి దిగారు.
ఆదివాసీ బిడ్డ అయిన తన ఉన్నతిని ఓర్వలేకే వారు కుట్రలు పన్నుతున్నారని ఆయన వాపోయారు. గతంలో ఆదిలాబాద్ లో బీజేపీ లేదని, తాను ఆ పార్టీలో చేరిన తర్వాతే జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని వివరించారు. జిల్లాలో పార్టీ ఎదుగుదలకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అటువంటి తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీ లాడ్స్ నిధులను దుర్వినియోగం చేయలేదని సోయం బాపురావు తేల్చి చెప్పారు.