Nagoba Jatara 2025: వైభవంగా జరుగుతున్న నాగోబా జాతర.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు.

Nagoba Jathara

నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరలో ఇప్పటికే మహా పూజ, విశ్రాంతి, పేర్సాపెన్ ముగిశాయి. శుక్రవారం నాగోబా దర్బార్, శనివారం బేతల్ పూజలు, మండగాజిలింగ్.. ఆదివారం షాంపూర్ జాతర జరుగుతాయి.

జారతలో భాగంగా మెస్రం వంశీయులు శుద్ధ గంగాజలాలు తీసుకొస్తారు. నాగదేవతలకు వారు ప్రత్యేక పూజలు చేసి, జాతరను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇవాళ జాతరకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం జాతరలో భాగంగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక
నాగోబా జాతర ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక. ఇది గోండుల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తారు. నాగోబాను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతర ప్రతి ఏడాది పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి ప్రారంభం అవుతుంది.

ఈ జాతర సాధారణంగా మెస్రం వంశీయులు అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో ప్రారంభం అవుతుంది. మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. నిన్న, ఇవాళ పలు ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కాగా, నాగోబాను ప్రజలు సర్పదైవంగా భావించి పూజలు చేశారు.

గిరిజనులు చేసే సంప్రదాయ నృత్యాలు, వారి సంగీతం, వేషధారణ భక్తులను ఆకర్షిస్తాయి. జాతరలో భాగంగా జరిగే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు. నాగోబా జాతరలో గిరిజనులు ప్రకృతిని పూజిస్తారు. గోదావరి నుంచి జలాన్ని తీసుకువచ్చి నాగోబాను అభిషేకిస్తారు.

Makkan Singh Raj Thakur: ఎన్టీపీసీ వర్సెస్‌ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌.. ఏం జరుగుతోంది?