పాతబస్తీలోని పాడుబడ్డ ఇంట్లో అస్థిపంజరం ఎవరిది..? పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్.. కుటుంబ సభ్యులంతా ఎక్కడ.. అమీర్ ఖాన్‌ చనిపోయాడా..

నాపల్లి మార్కెట్ ప్రాంతంలో అస్థిపంజరం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఆ ఇంట్లో ఉంది ఎవరు.. వారంతా ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో..

Police investigation

Hyderabad: హైదరాబాద్ నాపల్లి మార్కెట్ ప్రాంతంలో అస్థిపంజరం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సోమవారం స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా బాల్ తాళం వేసిఉన్న ఇంట్లో పడింది. ఓ యువకుడు బాల్ తీసుకువచ్చేందుకు ఇంటి వెనుకవైపు ఉన్న గోడదూకి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన అతడికి రిఫ్రిజిరేటర్ ఎదుట అస్థిపంజరం కనిపించింది. ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు.

Also Read: గద్వాల్ తేజేశ్వర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మరో కీలక అంశం వెలుగులోకి.. ఐశ్వర్య గదిలో సీసా.. స్పై కెమెరా..

 

అస్థి పంజరం కనిపించిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు, హబీబ్ నగర్ పోలీసులు పరిశీలించి ఎముకల గుడును, అనవాళ్లను తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం ఘటన స్థలిని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పరిశీలించారు. అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసును ఛేదించేందుకు కుటుంబ సభ్యులందరిని స్టేషన్‌కు రప్పించేలా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇంటి యజమాని అమీర్ ఖాన్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడేళ్లుగా అతను ఎవరికీ కనిపించలేదని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. ముర్గీ మార్కెట్ సమీపంలోని ఇంట్లో మునీర్ ఖాన్ ఉండేవాడు. ఆయనకు పది మంది సంతానం. వీరిలో ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు. తండ్రి మరణం తరువాత కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడంతో వారు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆ తరువాత ఆ ఇంట్లో అతడి కుమారుడు అవివాహితుడైన అమీర్ ఖాన్ (55) ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఏడాది క్రితం అమీర్ ఖాన్ చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అస్థిపంజరం అతనిదేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రక్త సంబంధీకుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేపట్టనున్నారు.

పెళ్లి, ఆస్తి కోసం గొడవ పడిన అమీర్ ఖాన్‌ను ఎవరైనా హత్య చేసి తాళం వేశారా..? లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరినీ నాంపల్లి స్టేషన్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని విచారించడం ద్వారా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మునీర్ కుటుంబ సభ్యులందరూ వస్తే కానీ ఈ కేసు చిక్కుముడి వీడే పరిస్థతి కనిపించడం లేదు.