Nandhikanti Sridhar : కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నేత, ఇక మల్కాజిగిరి మాదే అన్న కేటీఆర్

బీఆర్ఎస్ లో ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవాన్ని కల్పిస్తాం. మాకున్న హైకమాండ్ కేసీఆర్ మాత్రమే. మాకు ఢిల్లీలో బాసులు లేరు. Nandhikanti Sridhar

Nandikanti Sridhar Joins BRS (Photo : Twitter)

Nandhikanti Sridhar Joins BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మల్కాజిగిరి కాంగ్రెస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ గా పని చేసిన నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నందికంటి శ్రీధర్ పార్టీలో చేరిక సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నందికంటి శ్రీధర్, ఆయన అనుచరులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

జీవితమంతా కాంగ్రెస్ కోసం పని చేసినా..
”కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో (భారత రాష్ట్ర సమితి) చేరాలన్న పెద్ద నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వచ్చిన శ్రీధర్ కి స్వాగతం. జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ఆయనకు అక్కడ అన్యాయం జరగడంతో బీఆర్ఎస్ లో చేరుతున్నారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సరైన ఎజెండా లేకుండా ప్రజల కోసం పని చేశాము. ఈ పదేళ్లు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డాం. మాకు అవకాశం ఇచ్చిన ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పని చేశాం.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

శ్రీధర్ సేవలకు తగిన గౌరవం కల్పిస్తాం..
గత పదేళ్లు హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో, ఏ విధంగా అభివృద్ధి అయిందో గుర్తించాలి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మరింతగా పనిచేస్తాం. నందికంటి శ్రీధర్ కి కాంగ్రెస్ లో అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ లో ఆయన రాజకీయ సేవలకు తగిన గౌరవాన్ని కల్పిస్తాం. పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న శ్రీధర్ చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. నేను పార్టీ కోసం అత్యంత నిబద్ధతతో పని చేసే వ్యక్తిని అని, అంతే నిబద్దతతో బీఆర్ఎస్ కోసం కూడా పని చేస్తానని శ్రీధర్ చెప్పారు.

మాకున్న హైకమాండ్ ఆయనొక్కరే..
తనతో పాటు బీఆర్ఎస్ లో చేరిన నాయకులు, కార్యకర్తలకు కూడా సరైన అవకాశాలు ఇచ్చే బాధ్యతను మీరు తీసుకోవాలని శ్రీధర్ నన్ను కోరారు. శ్రీధర్ అడిగిన మేరకు ఈరోజు బీఆర్ఎస్ లో చేరుతున్న ఆయన అనుచరులనూ కాపాడుకుంటాం. సరైన విధంగా గౌరవించుకుంటాం. మాకున్న హైకమాండ్ కేసీఆర్ ఒక్కరే. ఆయన ఆదేశాలు, సూచనలు మేరకు మాత్రమే పార్టీ పని చేస్తుంది. మాకు ఢిల్లీలో బాసులు లేరు. ఈరోజు చేరిన నందికంటి శ్రీధర్, కాంగ్రెస్ శ్రేణులు కలిసి పని చేసి మల్కాజిగిరిని గెలిపించుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకుంది” అని కేటీఆర్ అన్నారు.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

మల్కాజిగిరి కాంగ్రెస్ లో మైనంపల్లి చిచ్చు..
బీఆర్ఎస్ కు చెందిన మైనంపల్లి హనుమంతరావుని కాంగ్రెస్ లో చేర్చుకోవడం, ఆయనకు రెండు సీట్లు ఇవ్వడం నందికంటి శ్రీధర్ కు నచ్చలేదు. మల్కాజిగిరి టికెట్ తనకే వస్తుందని నందికంటి శ్రీధర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ ఆశలపై కాంగ్రెస్ పెద్దలు నీళ్లు చల్లారు. అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ నేతలను తీవ్రంగా వేధించిన మైనంపల్లి హనుమంతరావుని కాంగ్రెస్ లో చేర్చుకోవడమే కాకుండా ఏకంగా రెండు టికెట్లు ఇవ్వడం దారుణం అన్నారు నందికంటి శ్రీధర్. ఈ పరిణామాలతో కలత చెందిన ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా రాహుల్ గాంధీ బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు.