baby left out : ఫ్యాక్టరీ బోర్డుకు ఉయ్యాల కట్టి పసిబిడ్డను పడుకోబెట్టి వదిలేసారు..

baby left out : ఫ్యాక్టరీ బోర్డుకు ఉయ్యాల కట్టి పసిబిడ్డను పడుకోబెట్టి వదిలేసారు..

New Born Baby Left Out  At Roadside

Updated On : March 18, 2021 / 1:08 PM IST

new born baby left out  at roadside : నడిరోడ్డుమీద, ముళ్లపొదల్లోను, రోడ్డు పక్కన చెత్త కుప్పల్లోను ఇలా ఎక్కడపడితే అక్కడ పసిబిడ్డల్ని వదిలేస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. కన్నవాళ్లకు బరువైతే బిడ్డల్ని కనటం ఎందుకు? వారి భవిష్యత్తును రోడ్డు పాలు చేయటమెందుకు? అనే పరిస్థితులకు దారి తీస్తున్నాయి పలు ఘటనలు. హైదరాబాద్ లో ఓ పసిబిడ్డ మృతదేహాన్ని ఓ అట్టపెట్టెలో పెట్టి వదిలేశారు. అలాగో మరో పసిగుడ్డును ముళ్లపొదలో వదిలేసిపోయారు. కానీ ఓ తల్లి ఏకంగా తన బిడ్డను ఓ ఫ్యాక్టరీ బోర్డుకు ఉయ్యాల కట్టి మరీ దాంట్లో పసిబిడ్డను వదిలేసి పోయింది. వదిలేసిందా? లేదా వదిలించుకుందా? ఏదైనా ఆ పసిబిడ్డ మాత్రం వీధినపడిన ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఓ రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. పొచ్చెర గ్రామ శివారులోని ఓ ప్రయివేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీ బోర్డుకు చీరతో ఓ ఉయ్యాలను కట్టి అందులో రెండు నెలల వయస్సున్న పసికందును పడుకోబెట్టి వదిలేశారు ఎవరో. ఈక్రమంలో అటుగా వెళ్తున్న స్థానికులు పసికందు ఏడుపులు వినిపించడంతో ఆశ్చర్యపోయారు. ఎక్కడాని తేరిపారా చూశారు. ఫ్యాక్టరీ బోర్డుకు ఉన్న చీర ఉయ్యాలలోంచి పసికందు ఏడుపులు వినిపించటాన్ని గుర్తించారు. వెంటనే తాంసి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో పోలీసులు..బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్ లైన్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. పసికందును జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించి చికిత్సలు అందజేశారు.

అనంతరం అధికారులు పసికందును శిశు గృహానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిడ్డను కావాలనే ఎవరో వదిలించుకున్నారని..పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రుల్లోనూ ఊళ్లల్లోనూ ఎవరికి కాన్పులు జరిగాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోను..గ్రామాల్లోను విస్తృతంగా ప్రచారం చేయించి సదరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.