Musi Riverfront Development : మూసీ ప్రాజెక్టు టెండర్లపై కొత్త వివాదం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Musi Riverfront Development : మూసీ ప్రాజెక్టు టెండర్లపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

KTR Comments on Musi project tenders,

Musi Riverfront Development : తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టు అమలు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన విధానం నుంచి టెండర్ల ప్రక్రియ వరకు పలు అంశాలను ప్రశ్నించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం కాకుండానే బిడ్లు ఆహ్వానించడం ఏమిటని నిలదీశారు.

Also Read : Donald Trump : ఓటమి దెబ్బతో బుద్దొచ్చింది..! వలసలపై ట్రంప్‌ యూటర్న్‌..?

ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహించారని, డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు బిడ్లను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సిద్ధం చేయకుండానే ఇంత భారీ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు.

ఒకపక్క రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల అవసరాలను పక్కనపెట్టి మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం హడావుడి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘‘ప్రజలు లేకుండా పబ్లిక్ హియరింగ్.. డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు బిడ్లు పిలవడం.. ఇందులో విడ్డూరం ఏంటంటే, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ‘సుందరీకరణ’ పేరుతో హడావుడి చేయడం. ఇది తుగ్లక్ ప్రభుత్వం కాకపోతే మరేం అనాలో అర్థం కావడం లేదు” అంటూ కేటీఆర్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.

మూసీ ప్రాజెక్టు వ్యయం, పర్యావరణ ప్రభావం, నిర్వాసితుల పునరావాసం, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై ఇప్పటికే చర్చ కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.