తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ‘రైతు భరోసా’ డబ్బులు రాలేదా..? ఇవాళే లాస్ట్ డేట్.. మళ్లీ అవకాశం ఉండదు..

తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయంకోసం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Rythu Bharosa scheme

Rythu Bharosa: తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయంకోసం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేటా ఎకరాకు రూ.12వేల చొప్పున రెండు విడుతల్లో (ఖరీఫ్, రబీ) అందజేస్తుంది. ప్రస్తుతం ఖరీఫ్ పంటసాగుకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. నాలుగు రోజుల్లో రూ.6,405 కోట్లు విడుదల చేసింది. దీంతో ఒక కోటి ఆరు లక్షల ఎకరాల భూములు గల 62లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది.

Also Read: Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజులు బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు..

రాష్ట్రంలో మొత్తం 70,11,984 మంది రైతులకు 1.49 కోట్ల ఎకరాల మేరకు వ్యవసాయయోగ్యమైన భూములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రైతుభరోసా పథకం కింద ఖరీఫ్ పంట సాగుకోసం రూ.9వేల కోట్ల నిధులు అవసరమని లెక్కేశారు. ఇప్పటి వరకు పూర్తయినవిగాక మరో ఐదు రోజుల్లో ఇంకా 43 లక్షల ఎకరాలుగల ఎనిమిది లక్షల మంది రైతులకు రూ.4,600 కోట్ల మేర నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఇప్పటికీ రైతు భరోసా డబ్బులు పడలేదు. అలాంటివారు మండల లేదా జిల్లా వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వివరాలు అందజేయాలని, పథకానికి వారు అర్హత కలిగి ఉన్నట్లయితే వారి ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

Also Read; ప్రేమగా లస్సీ ఇచ్చింది.. తెల్లారేసరికి నగలు తీసుకొని ప్రియుడితో జంప్.. పెండ్లి జరిగిన 50రోజులకే ఘటన.. సీసీటీవీలో దృశ్యాల్లో..

మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా పంట భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో గతవారం రోజులుగా పెద్దెత్తున దరఖాస్తులు వస్తున్నాయి. జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయిన పంట భూములకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు అనుమతించింది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అయితే, జూన్ 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టితో చివరి తేదీ కావడంతో కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు ‘రైతు భరోసా’ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న గ్రామాల్లోని రైతుల నుంచి అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారులు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఏఈఓలకు రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు వంటి ధ్రువపత్రాలు ఇస్తే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. ఇవాళ్టితో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.