Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజులు బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు..
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ, రేపు..

Telangana Rains
Telangana Rain : నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇవాళ (శుక్రవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు (శనివారం) ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.