Nirmal Constituency: నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వారేనా?

నిర్మల్‌లో.. గత ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. మరి.. ఈసారి కూడా బీఆర్ఎస్సే గెలుస్తుందా? లేదా? అనేదే.. ఆసక్తిగా మారింది.

Nirmal Assembly Constituency: నిర్మల్ పాలిటిక్స్.. అస్సలు నార్మల్‌గా లేవు. గడిచిన కొన్నేళ్లలో ఎన్నడూ కనిపించనంత పొలిటికల్ హీట్ కనిపిస్తోంది అక్కడ. ప్రధాన పార్టీలన్నింటిలోనూ.. నిర్మల్ కాక రేపుతోంది. ఈసారి కూడా అధికార బీఆర్ఎస్ తరఫున.. దేవాదాయ శాఖ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) పోటీ చేయడం ఖాయమైపోయింది. అయితే.. ఆయనపై ప్రత్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారన్నదే ఇంకా తేలడం లేదు. మరోవైపు.. మంత్రి ఇంద్రకరణ్‌పై.. సీనియర్ నేత శ్రీహరిరావు తిరుగుబాటు బావుటా ఎగరేయడం కూడా కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో.. విపక్షాల నుంచి ఎన్నికల బరిలో దిగబోయే అభ్యర్థులెవరు? నిర్మల్ అసెంబ్లీలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

ఇంద్రకరణ్, శ్రీహరిరావు, మహేశ్వర్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో.. నిర్మల్ టాప్ గేర్‌లో ఉంటుంది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలంతా.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లే. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నిర్మల్‌లో.. గత
ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. మరి.. ఈసారి కూడా బీఆర్ఎస్సే గెలుస్తుందా? లేదా? అనేదే.. ఆసక్తిగా మారింది. అక్కడి లోకల్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూసేముందు.. నిర్మల్ పొలిటికల్ హిస్టరీని ఓసారి చూద్దాం. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా.. నాలుగుసార్లు టీడీపీ విజయం సాధించింది. 2009 నుంచి నిర్మల్‌లో ట్రెండ్ మారింది. ఆ ఎన్నికల్లో.. ప్రజారాజ్యం పార్టీకి పట్టం కట్టిన నిర్మల్ ఓటర్లు.. 2014లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Allola Indrakaran Reddy) ని గెలిపించారు. గత ఎన్నికల్లో.. తొలిసారి నిర్మల్ గడ్డపై.. గులాబీ జెండా ఎగిరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు.

ప్రస్తుతం.. నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 8 మండలాలున్నాయి. అవి.. నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, దిలావర్ పూర్, లక్ష్మణచందా, మామడ, సారంగపూర్, నర్సాపూర్(జి), సోన్. ఈ మండలాల పరిధిలో.. మొత్తం 2 లక్షల 33 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నిర్మల్ సెగ్మెంట్‌లో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వీళ్లే.. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తూ ఉంటారు. దాంతో.. రానున్న ఎన్నికల్లో నిర్మల్ ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. నిర్మల్‌ ఓటర్లు బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లోనే ఇంద్రకరణ్ రెడ్డి గెలుపుతో.. బీఆర్ఎస్(BRS Party) బోణీ కొట్టింది. ప్రస్తుతం.. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014లో బీఎస్పీ తరఫున గెలిచిన ఆయన.. తర్వాత కారెక్కి.. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రి హోదా దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మళ్లీ గెలిచారు.

Also Read: పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా.. ఈసారి సత్తా చాటేదెవరు?

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Photo: Twitter)

ఇంద్రకరణ్‌కు అసమ్మతి సెగ
నిర్మల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఇంద్రకరణ్‌కు.. సొంత పార్టీ నుంచి అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. 2014 ఎన్నికల్లో ఇంద్రకరణ్‌పై.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సీనియర్ నేత శ్రీహరిరావు (Kuchadi Srihari Rao) ఈసారి టికెట్ రేసులో ఉండటం.. ఆసక్తి రేపుతోంది. అయితే.. సీఎం కేసీఆర్ ఈసారి కూడా సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ ఇస్తానని చెప్పడం.. ఇంద్రకరణ్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. కానీ.. ఆయన గత ఎన్నికల్లోనే.. మరోసారి పోటీ చేయబోనని చెప్పి ప్రచారం చేసి గెలిచారు. దీంతో.. ఈసారి ఆయనకు కాకుండా.. ఉద్యమకారుల తరఫున తనకు అవకాశం ఇవ్వాలని.. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి ఇంద్రకరణ్ గనక నిర్మల్ నుంచి పోటీ చేయకపోతే.. తన కోడలికి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించి.. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

కె.శ్రీహరిరావు (Photo: FB)

బీఆర్ఎస్‌లో వర్గపోరు
మరోవైపు.. నిర్మల్ బీఆర్ఎస్‌లో వర్గపోరు తీవ్రమవుతోంది. ఇటీవలే.. పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు ఓ లేఖ విడుదల చేశారు. మంత్రి ఇంద్రకరణ్.. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని.. ఏనుగు గుర్తుపై గెలిచి మంత్రి అయ్యారని.. ఆత్మీయ సమ్మేళనాలకు ఉద్యమకారులను పిలవడం లేదని రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపారు. దాంతో.. రాబోయే ఎన్నికల్లో నిర్మల్ (Nirmal) నుంచి శ్రీహరిరావు టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ గనక దక్కకపోతే.. కాంగ్రెస్, బీజేపీలో.. ఏదో ఒక పార్టీ తరఫున బరిలో దిగే చాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే జరిగితే.. మంత్రి ఇంద్రకరణ్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

Also Read: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Photo: FB)

బీజేపీ తరఫున ఏలేటి?
ఇక.. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డే.. ఈసారి బీజేపీ తరఫున బరిలో దిగే అవకాశాలున్నాయి. 2009లో.. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న టైమ్‌లోనే.. మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy)అనూహ్యంగా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత.. కాంగ్రెస్‌లో చేరి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మొన్నటి వరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కన్వీనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే.. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. పీసీసీ షోకాజ్ నోటీసులివ్వడం.. గంట లోపే వివరణ ఇవ్వాలనడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. తనకు షోకాజ్ నోటీసులిచ్చే అధికారం పీసీసీకి లేదని.. పొమ్మనలేగ పొగబెడుతున్నారని.. రేవంత్‌పై ఫైర్ అయ్యారు. నేరుగా.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దగ్గరే తేల్చుకుంటానంటూ.. ఢిల్లీ బయల్దేరారు. అటు నుంచి అటే.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. ఇక.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపైనా.. అవినీతి, చెరువుల కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. అవే.. తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

ఇక.. బీజేపీ నుంచి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితులతో.. మహేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోతే శ్రీహరి రావు.. కమల తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. దీంతో నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్‌ (Nirmal Assembly Constituency)లో ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.