nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపింది.
అయితే..వీరు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పీపీఈ కిట్లతో అంబులెన్స్‌లలో పోలింగ్ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. కరోనా సోకిన ఓటర్లను సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. వీరి పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళుతారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్), వి.సుభాష్‌రెడ్డి (కాంగ్రెస్), పి.లక్ష్మినారాయణ (బీజేపీ) పోటీలో ఉన్నారు.