Nizamabad Urban constituency: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గుప్త హ్యాట్రిక్ కొడతారా?

ఈసారి కూడా గెలిచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా? అసలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఎమ్మెల్యే పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏమంటున్నారు?

Nizamabad Urban Assembly constituency: రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. విలక్షణమైన తీర్పునిచ్చే ఓటర్లు. అదే.. నిజామాబాద్ అర్బన్. గులాబీ పార్టీకి అడ్డాగా మారిన అర్బన్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్‌కే పట్టం కట్టారు ఇందూరు ప్రజలు. మరి.. ఈసారి కూడా గెలిచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త (Bigala Ganesh Gupta) హ్యాట్రిక్ కొడతారా? అసలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఎమ్మెల్యే పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏమంటున్నారు? విపక్షాల నుంచి ఎవరెవరు టికెట్ రేసులో ఉన్నారు? ఈసారి.. ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది? అర్బన్‌లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి?

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం.. 2009లో ఏర్పడింది. 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్.. ఇప్పుడు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉంది. అర్బన్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2 లక్షల 68 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో.. మున్నూరు కాపు, పద్మశాలి, మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఎంఐఎం కలయికతో.. అధికార బీఆర్ఎస్ అర్బన్‌లో తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఇక్కడి నుంచి ఎంఐఎం గనక పోటీ చేస్తే.. అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులుంటాయనే వాదన కూడా ఉంది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండానే ఎగురుతోంది. 2014, 2018 ఎన్నికల్లో.. అర్బన్ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా? లేదా? అన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

బిగాల గణేశ్ గుప్త (Photo: Facebook)

వివాదరహితుడిగా, సౌమ్యుడిగా.. ఎమ్మెల్యే గణేశ్ గుప్తకు పేరుంది. ఈసారి ఎన్నికల్లోనూ.. సిట్టింగ్‌లకే సీట్లు అని గులాబీ దళపతి కేసీఆర్ ఇచ్చిన హామీతో.. టికెట్ తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు గణేశ్ గుప్త. దాంతో మరోసారి అర్బన్‌లో గులాబీ జెండా ఎగరేసేందుకు.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలై.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Also Read: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

ఆకుల లలిత (Photo: Facebook)

ఇక.. మున్నూరు కాపు నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత (Akula Lalitha).. అర్బన్ సెగ్మెంట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. బీఆర్ఎస్ లేదంటే.. మరో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక.. అర్బన్ సెగ్మెంట్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి.. వంద కోట్లు కేటాయించారు. ఈ నిధులతో.. పాత కలెక్టరేట్ స్థానంలో కళాభారతి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా.. నగర రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐటీ హబ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రఘనాథపల్లి చెరువు సుందరీకరణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గణేశ్ గుప్త. వీటిలో.. ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తయ్యాయి. రఘునాథపల్లి చెరువు సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షే పథకాలనే.. బీఆర్ఎస్ నేతలు నమ్ముకొని ఉన్నారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న కొంత వ్యతిరేకత.. ఇబ్బంది పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. నియోజకవర్గంలో బీసీ నినాదం వినిపిస్తుండటం, ఎంఐఎం పోటీకి సిద్ధమవుతుండటంతో.. కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.

ధర్మపురి సంజయ్‌

ఇక.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర.. అర్బన్ కార్యకర్తల్లో జోష్ నింపింది. కాంగ్రెస్ టికెట్ రేసులో.. సీనియర్ నేత డీఎస్ తనయుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌తో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కేశవేణు ఉన్నారు. ఒకవేళ.. ధర్మపురి సంజయ్ గనక బరిలోకి దిగితే మాత్రం.. నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ ఖాయమనే చర్చ సాగుతోంది. అదేవిధంగా.. మరో పార్టీలో ఉన్న నేత.. ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల.. ఎన్నికల నాటికి ఎవరికి టికెట్ దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ నాయకులు మాత్రం నిజామాబాద్ అర్బన్‌లో.. గెలుపుపై ధీమాగా ఉన్నారు.

యెండల లక్ష్మినారాయణ (Photo: Facebook)

ఇక.. బీజేపీ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ (Yendala Laxminarayana), జిల్లా బీజేపీ మాజీ ప్రెసిడెంట్ బస్వ లక్ష్మినర్సయ్య టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వాళ్లు.. గ్రూపులుగా ఏర్పడి రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వాళ్లు ప్రజా సమస్యలపై.. సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. ధన్‌పాల్ సూర్యనారాయణకే.. టికెట్ ఖరారైందనే ప్రచారం నడుస్తోంది.

Also Read: పెద్దపల్లి సెగ్మెంట్‌లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు.. గెలిచే సత్తా ఉన్న లీడర్లు ఎవరు?

టికెట్‌పై ఎవరి ధీమా ఎలా ఉన్నా.. నియోజకవర్గంలో అధికార పార్టీ చేసిన అభివృద్ధిపై విపక్షాల నేతలు పెదవి విరుస్తున్నారు. కమీషన్లు తీసుకొని పనులు చేస్తున్నారంటూ.. ఆరోపణలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య.. నిజామాబాద్ అర్బన్‌లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు