Peddapalli Constituency: పెద్దపల్లి సెగ్మెంట్‌లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు.. గెలిచే సత్తా ఉన్న లీడర్లు ఎవరు?

ఈసారి తన రాజకీయ వారసురాలిగా.. కోడలిని పోటీ చేయించాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే. పెద్దపల్లి సెగ్మెంట్‌లో.. ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి?

Peddapalli Constituency: పెద్దపల్లి సెగ్మెంట్‌లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు.. గెలిచే సత్తా ఉన్న లీడర్లు ఎవరు?

peddapalli assembly constituency: పెద్దపల్లి.. గులాబీ జెండాకు అడ్డాగా మారి.. దాదాపు పదేళ్లవుతోంది. రాబోయే ఎన్నికల్లోనూ.. ఇక్కడ మళ్లీ అదే జెండా ఎగురుతుందనే ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సిట్టింగ్ ఎమ్మెల్యే.. దాసరి మనోహర్ రెడ్డి కూడా.. హ్యాట్రిక్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నారు. అయితే.. ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అనేదే.. నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు.. అవకాశం వస్తే పోటీకి సై అంటున్నారు సొంత పార్టీ ఎమ్మెల్సీలు. కానీ.. అన్నీ అనుకూలిస్తే.. ఈసారి తన రాజకీయ వారసురాలిగా.. కోడలిని పోటీ చేయించాలని భావిస్తున్నారట ఎమ్మెల్యే. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్‌కు విపక్షాలు ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాయ్? ఏయే పార్టీల నుంచి.. ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు? బరిలో నిలిచి.. గెలిచే సత్తా ఉన్న లీడర్లు ఎవరు? ఓవరాల్‌గా.. పెద్దపల్లి సెగ్మెంట్‌లో.. ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి?

Dasari Manohar Reddy, Gujjula Ramakrishna Reddy, Vijaya Ramana Rao

దాసరి మనోహర్ రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, విజయ రమణరావు (Photos: Facebook)

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ.. పెద్దపల్లి పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్. ఇప్పటికే.. వరుసగా రెండు సార్లు గెలిచిన అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. దాసరి మనోహర్ రెడ్డి.. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే.. విద్యాసంస్థల అధినేతగా ఉన్న మనోహర్ రెడ్డి.. ఈసారి తన రాజకీయ వారసురాలిగా కోడలు మమతారెడ్డి (Dasari Mamatha Reddy)ని.. రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆమెను.. పెద్దపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ని చేశారు. అన్నీ.. అనుకూలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆవిడను ఎమ్మెల్యే బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధికార పబార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో.. మరోసారి తానే బరిలోకి దిగడమే బెటరనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. రెండోసారి ఆయన విజయం సాధించినప్పటి నుంచే.. అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు.. ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతల తీరు కూడా మనోహర్ రెడ్డికి.. తలనొప్పిగా మారింది. పెద్దపల్లిలో.. అధికార బీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక.. అంతర్గత విభేదాల కారణంగా బీజేపీ అంతగా ప్రభావం చూపకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే.. ప్రధాన పార్టీల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో.. పెద్దపల్లి రాజకీయాలు.. రసవత్తరంగా మారిపోయాయ్.

1952లో ఏర్పడిన పెద్దపల్లి నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ.. అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. పెద్దపల్లి గులాబీ పార్టీకి అడ్డాగా మారిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో.. వరుసగా కారు పార్టీనే గెలుస్తూ వస్తోంది. నియోజకవర్గంలో 2 లక్షల 40 వేలకు పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. అత్యధికంగా బీసీల ఓట్ బ్యాంక్ (BC Vote Bnak) ఉంది. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వాళ్లే. గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి బీసీ ఓట్లను ఎక్కువగానే సంపాదించారు. ప్రధానంగా.. యాదవులు, ముదిరాజ్‌లు, గీత కార్మికుల మద్దతును బట్టే.. గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. దాంతో.. ఈ 3 సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ఫోకస్ పెంచాయి.

Dasari Manohar Reddy

దాసరి మనోహర్ రెడ్డి (Photo: Facebook)

పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు.. అన్ని పార్టీల్లోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అధికార బీఆర్ఎస్ విషయానికొస్తే.. టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, వెంకట్రామి రెడ్డి ఉన్నారు. అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సై అంటున్నారు ఎమ్మెల్సీలు. మరో నేత నల్లా మనోహర్ రెడ్డి సైతం.. ఈసారి టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గంలో మౌలిక వసతులైన తాగు, సాగు నీటికి సమస్య లేకుండా చేశామంటున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ బరిలోకి దిగేది తానేనని.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy).

Chinthakunta Vijaya Ramana Rao

చింతకుంట విజయ రమణరావు (Photo: Facebook)

కాంగ్రెస్ విషయానికొస్తే.. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు (Chinthakunta Vijaya Ramana Rao) మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. 2018 ఎన్నికల్లో.. బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. కేవలం 8 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న విజయ రమణకు.. గతంలో ఆయన అనుచరుడిగా ఉన్న గంట రాములు యాదవ్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు విజయ రమణ రావు. ఈసారి.. గెలుపు తనదేనని చెబుతున్నారు.

Ganta Ramulu Yadav

గంట రాములు యాదవ్ (Photo: Facebook)

కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఉన్న ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ (Ganta Ramulu Yadav) తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. టికెట్ కోసం.. గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కకపోతే.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. బీసీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగితే.. ప్రధాన పార్టీలకు కొంత ఎఫెక్ట్ తప్పదనే టాక్ వినిపిస్తోంది.

Gujjula Ramakrishna Reddy

గుజ్జుల రామకృష్ణారెడ్డి (Photo: Facebook)

ఇక.. బీజేపీలోనూ గందరగోళం నెలకొంది. కమలం పార్టీలోనూ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. లీడర్లంతా.. ఒక్క చాన్స్ ఇచ్చి చూడండని.. అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి (Gujjula Ramakrishna Reddy) ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో.. ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన ఆయన.. ఈసారి పార్టీలో జోష్ రావడంతో.. మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

Dugyala Pradeep Kumar

దుగ్యాల ప్రదీప్ కుమార్ (Photo: Facebook)

సీనియర్ కోటాలో.. ఇదే ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ (Dugyala Pradeep Kumar) కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే.. ఎన్ఆర్ఐ గొట్టె ముక్కుల సురేశ్ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకొని.. పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. బీజేపీలో నెలకొన్న విభేదాల కారణంతో.. క్యాడర్‌కు ఎవరి వెంట నడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని.. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న సురేశ్ రెడ్డి చెబుతున్నారు.

Also Read: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

Usha Dasari

దాసరి ఉష (Photo: Twitter)

ఇక.. బీఎస్పీ నుంచి దాసరి ఉష (Usha Dasari) పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే.. ఆవిడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో.. ప్రచార రథాన్ని కూడా తిప్పుతున్నారు. ఇక.. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్న పెంట రాజేశ్.. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (All India Forward Bloc) నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పెంట రాజేశ్.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు బావమరిది. అయితే.. పోటీలో ఎవరున్నా.. పెద్దపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బీజేపీలో నాయకుల మధ్య నెలకొన్ని విభేదాల కారణంగా.. కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది.. ఆసక్తిగా మారింది. ఓవరాల్‌గా.. పెద్దపల్లి సెగ్మెంట్‌లో.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఇంట్రస్టింగ్‌గా మారింది.