Vemulawada Constituency: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. వేములవాడలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమే అయినప్పటికీ.. టికెట్ దక్కని ఆశావహులు.. రెబల్స్ గా మారితే.. ప్రధాన పార్టీలకు చిక్కులు తప్పకపోవచ్చు.

Vemulawada Constituency: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

Vemulawada Assembly Constituency: తెలంగాణలో టెంపుల్ పాలిటిక్స్ జరిగే అవకాశమున్న అసెంబ్లీ సెగ్మెంట్.. వేములవాడ. ఇప్పుడు.. టెంపుల్ సిటీలో.. పొలిటికల్ టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. వేములవాడ పేరు చెప్పగానే.. గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. వాళ్లే.. చెన్నమనేని రాజేశ్వర్ రావు. ఆయన రాజకీయ వారసుడు.. రమేశ్ బాబు. గతంలో.. సిరిసిల్లతో ఉన్నా.. తర్వాత వేములవాడగా మారినా.. లోకల్ పాలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ మాత్రం వీళ్లదే. అలాంటి చోట.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ బాబుకి.. ఈసారి అధికార పార్టీ నుంచి టికెట్ దక్కుతుందా? బండి సంజయ్ కాకపోతే.. బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు? కాంగ్రెస్తో పాటు విపక్షాల నుంచి టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? ఈసారి ఎన్నికల్లో.. టెంపుల్ సిటీ వేములవాడలో కనిపించబోయే సీనేంటి?

Chennamaneni Vikas, Adi Srinivas

చెన్నమనేని రమేశ్, చెన్నమనేని వికాస్, ఆది శ్రీనివాస్ (Photos: Twitter)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ.. ఆధ్యాత్మికంగానే కాదు.. రాజకీయంగానూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇందుకు.. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న.. చెన్నమనేని కుటుంబమే మెయిన్ రీజన్. ఓడినా, గెలిచినా.. ఈ ప్రాంత రాజకీయమంతా ఆ కుటుంబం చేతుల్లోనే సాగేది. గెలిస్తే ఎమ్మెల్యేగా అధికారం వారిదే. ఓడినప్పటికీ.. వీళ్లు మద్దతు తెలిపిన పార్టీనే అధికారంలో ఉండేది. దాంతో.. వేములవాడు నియోజకవర్గంలో చెన్నమనేని కుటుంబానికి.. తిరుగులేకుండా పోయింది. వేములవాడ పేరు చెప్పగానే.. గుర్తొచ్చేది చెన్నమనేని రాజేశ్వర్ రావు. ఆయన తనయుడిగా, రాజకీయ వారసుడిగా.. రమేశ్ బాబు కూడా వేములవాడ పాలిటిక్స్ కు కేరాఫ్ గా మారిపోయారు. అప్పట్లో.. ఓడినా.. గెలిచినా.. రాజకీయాల్లో తనదైన శైలితో.. రాజేశ్వర్ రావు ముందుకు సాగితే.. ఆ తర్వాత ఓటమే ఎరుగని నేతగా.. ముందుకు సాగుతున్నారు.. ఆయన తనయుడు చెన్నమనేని రమేశ్ బాబు (Chennamaneni Ramesh Babu).

ఒకప్పుడు సిరిసిల్ల (Sircilla) సెగ్మెంట్లో భాగంగా ఉన్న వేములవాడ ప్రాంతం.. 1967 లో వేములవాడతో కలిసి ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం నుండి సిపిఐ ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు చెన్నమనేని రాజేశ్వర్ రావు. ఇక అప్పటి నుండి 2004 వరకు ఓసారి ఓడుతూ, మరోసారి గెలుస్తూ సిపిఐ తరఫున గళం విన్పిస్తూ నియోజకవర్గ రాజకీయాలను శాసించారు రాజేశ్వర్ రావు. 2004లో మాత్రం టిడిపిలో చేరి విజయం సాధించిన రాజేశ్వర్ రావుకు ఆ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మిగిలాయి. ఆ తర్వాత చెన్నమనేని వారసుడిగా రమేష్ బాబు రంగంలోకి దిగడం, సిరిసిల్ల నియోజకవర్గం నుండి విడిపోయి వేములవాడ నియోజకవర్గంగా మారడం జరిగాయి. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో.. టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రమేశ్ బాబు. తర్వాత.. 2010లో తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ లో చేరారు. 2010 ఉపఎన్నికల్లో.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్లీ.. ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత.. 2014, 2018 ఎన్నికల్లోనూ.. వరుసగా విజయాలు సాధించారు రమేశ్ బాబు.

ఇలా.. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి.. వరుసగా వేములవాడలో గెలుస్తూ వస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రాజేశ్వర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేశ్ బాబు.. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1952లో వేములవాడతో కలిసి ఏర్పడిన సిరిసిల్ల నియోజకవర్గానికి 12 సార్లు.. ఆ తర్వాత వేములవాడగా మారిన తర్వాత 4 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో ఆరుసార్లు చెన్నమనేని రాజేశ్వర్ రావు, నాలుగు సార్లు చెన్నమనేని రమేశ్ బాబే గెలుపొందారు. తొలి రెండు సార్లు సిరిసిల్ల ఎస్సీ నియోజకవర్గంగా ఉండగా…ఆ తర్వాత జనరల్ గా మారింది. జనరల్ గా మారిన తర్వాత తొలి ఎన్నిక మినహా.. మిగతా 13 ఎన్నికల్లో.. చెన్నమనేని ఊసు లేకుండా.. నియోజకవర్గంలో రాజకీయమే సాగలేదు.

Also Read: హుజూరాబాద్ బరిలో బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది?

వేములవాడ సెగ్మెంట్పరిధిలో.. 6 మండలాలున్నాయ్. అవి.. కోనరావు పేట, చందుర్తి, రుద్రంగి, మేడిపల్లి, వేములవాడ, కథలాపూర్. వీటి పరిధిలో.. మొత్తం 2 లక్షల 8 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువగా గ్రామీణ ఓటర్లే ఉన్నారు. వీరిలో.. బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. దళితులు 35 వేలు, మున్నూరు కాపులు 29 వేలు, గీత కార్మికులు 22 వేలుగా ఉన్నారు. ఇక్కడ.. గెలుపోటములను నిర్దేశించేది.. ప్రధానంగా ఈ 4 సామాజికవర్గాలకు చెందిన ఓటర్లే.

Chennamaneni Ramesh

చెన్నమనేని రమేశ్ (Photo: Twitter)

ఇక.. రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు రెడీ అవుతున్నారు. అయితే.. ఇప్పటిదాకా ప్రజాక్షేత్రంలో ఆయన ఓటమి ఎరుగకపోయినా.. వివాదరహితుడిగా రమేష్ బాబుకు మంచి పేరే ఉన్నా… 2009 నుంచి వెంటాడుతున్న పౌరసత్వ వివాదం, స్థానికంగా ఉండరనే ప్రచారమే.. ప్రతి ఎన్నికల్లో ఆయనకు సవాల్గా మారుతూ వస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీల నుంచే ఈ విమర్శలు రాగా.. ఈసారి సొంత పార్టీలోనూ ఇవే గుసగుసలు మొదలయ్యాయి. దీంతో.. రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు టిక్కెట్ వస్తుందా? రాదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

చెన్నమనేని పౌరసత్వ వివాదం (Citizenship row)పై.. ఎన్నికలలోపే అంతిమ తీర్పు ఖాయమని.. దానిమీదే ఎమ్మెల్యే భవితవ్యం ఆధారపడి ఉంటుందని.. లెక్కలేసుకుంటున్నారు రమేష్ బాబు ప్రత్యర్థులతో పాటు…బిఆర్ ఎస్ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు. మొన్నటిదాకా.. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు తిరుగులేదనుకున్నారంతా.. అయితే కాంగ్రెస్ నుంచి కారెక్కిన చల్మెడ చేరికే.. ఇప్పుడు రమేష్ బాబు అనుచరులకు మింగుడపడని అంశంగా మారింది. మరోవైపు.. బీజేపీ అభ్యర్థిగా.. రమేష్ బాబు చిన్నాన్న.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు బరిలోకి దిగనుండటంతో.. వేములవాడ పాలిటిక్స్లో.. టెంపరేచర్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే.. వేములవాడ నియోజకవర్గంలో జరిగి అభివృద్ధి.. తన తండ్రి రాజేశ్వరరావు చేసిన సేవలే పునాదిగా.. మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే రమేశ్ బాబు. గతంలో కరువుతో అల్లాడిపోయే.. వేములవాడ ప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్య లేకపోవడం, ప్రసిద్ధ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జోరుగా సాగుతుండటం.. రమేశ్ బాబుకు లిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయ్.

Chalimeda Lakshmi Narasimha Rao

చల్మెడ లక్ష్మీ నరసింహరావు (Photo: Twitter)

రాబోయే ఎన్నికల్లో.. రమేశ్ బాబుకు ఏ కారణంగా టికెట్ దక్కకపోయినా.. బరిలో నిలిచేది చల్మెడ మెడికల్ కాలేజీల ఎండీ లక్ష్మీ నరసింహరావేననే (Chalimeda Lakshmi Narasimha Rao) చర్చ సాగుతోంది. టికెట్ హామీతోనే.. ఆయన కారెక్కారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆయన కూడా.. బరిలో దిగేందుకు సిద్ధమైనట్లే కన్పిస్తున్నారు.

Also Read: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

chennamaneni vikas

చెన్నమనేని వికాస్ (Photo: Twitter)

ఒకప్పటితో పోలిస్తే.. బీజేపీ కొంత పుంజుకోవడంతో.. ఆ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (chennamaneni vidyasagar rao) రాజకీయ వారసుడిగా.. ఆయన తనయుడు వికాస్.. వేములవాడ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో.. మెట్ పల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పనిచేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు.. వేములవాడే సొంత నియోజకవర్గం. 2009లో విద్యాసాగర్ రావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి తనయుడిని బరిలో దించి.. గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే.. ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు.. ఈటల రాజేందర్ (Eatala Rajender) తో పాటు కారు దిగి బీజేపీలో చేరిన మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ కూడా టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్నారు. అందువల్ల.. రాబోయే ఎన్నికల్లో.. బీజేపీ తరఫున వేములవాడ బరిలో దిగేదెవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.

Adi Srinivas

ఆది శ్రీనివాస్ (Photo: Facebook)

బీఆర్ఎస్, బీజేపీతో పోలిస్తే.. వేములవాడలో కాంగ్రెస్  టికెట్ కోసం పెద్దగా పోటీ లేదని చెప్పొచ్చు. వరుసగా ఓడిపోతూ వస్తున్న ఆది శ్రీనివాసే.. మరోసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ.. నియోజకవర్గంలోనే నిత్యం అందుబాటులో ఉండటం.. ఆది శ్రీనివాస్ కు ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. వరుసగా ఓడుతూ వస్తున్నారనే సానుభూతి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ, మళ్లీ కాంగ్రెస్.. ఇలా పార్టీలు మారడం ఆయనకు మైనస్ గా మారింది. మరోవైపు.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా.. వేములవాడపై ఫోకస్ చేశారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే.. ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారన్నది కీలకంగా మారనుంది. ఆయన నిర్ణయాన్ని బట్టే.. ఇక్కడి గెలుపోటములపై ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. వేములవాడలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమే అయినప్పటికీ.. టికెట్ దక్కని ఆశావహులు.. రెబల్స్ గా మారితే.. ప్రధాన పార్టీలకు చిక్కులు తప్పకపోవచ్చు. గతంలో ఇక్కడి నుంచి రెబల్గా బరిలోకి దిగిన రేగులపాటి పాపారావు, సీపీఐఎంఎల్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎన్వీ కృష్ణయ్య లాంటి వాళ్లు.. ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన దాఖలాలున్నాయి. దాంతో.. ఈసారి కూడా పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉంటుందా.. రెబల్స్ ఎంట్రీ ఇస్తే.. ఏ పార్టీకి ఎలాంటి చిక్కులొస్తాయన్నది.. ఆసక్తి రేపుతోంది.