డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ఊబకాయులు పెరిగిపోతున్నారు.. దేశంలోనే సెకండ్ ప్లేస్..
Obesity Problem : హైదరాబాద్ నగరంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ నివేదిక ప్రకారం.. ఏకంగా హైదరాబాద్ నగరంలో 37.5లక్షల మందిలో 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
Hyderabad Obesity Rate
HYD Obesity Rate: ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీరి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్యను పరిశీలిస్తే.. దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
Also Read : బీహార్ రాజకీయాల్లో బిగ్ ఛేంజ్.. నూతన ముఖ్యమంత్రి అతనే..! అధికారికంగా ప్రకటించడమే తరువాయి..
అపోలో హాస్పిటల్స్ రూపొందించిన హెల్త్ ఆఫ్ ది నేషన్ (HON) రిపోర్ట్ 2026 ప్రకారం.. హైదరాబాద్ నగరంలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 37.5లక్షల మందిలో 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 2025లో ఈ సంఖ్య 63శాతంగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 18శాతం పెరుగుదల చోటు చేసుకోవటం ఆందోళనకర విషయం.
ఈ నివేదిక ప్రకారం.. దేశంలో ముంబై 81.6శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. హైదరాబాద్ 81.3శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలో 78.4శాతం, బెంగళూరులో 77.8శాతం, చెన్నైలో 77.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లో కాస్త తక్కువ గణాంకాలు నమోదయ్యాయి.
ఊబకాయం, ప్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు.. నిత్య జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిలో ఉండటం, అధిక జంక్ ఫుడ్ తీసుకోవడంతోపాటు మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది నిద్రపోయేంత వరకు తమ ఫోన్లను స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విధానం వల్ల నిద్రలేమితో శరీరం యొక్క సహజ ప్రక్రియ దెబ్బతింటుంది. తద్వారా జీవక్రియలో అనేక రుగ్మతలకు దారితీస్తాయని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
2008 నుండి 2020 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) జరిపిన అధ్యయనంతో సహా, గతంలో జరిగిన అధ్యయనాలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గణనీయంగా ఊబకాయం బాధితులు పెరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
ఊబకాయం ఇప్పటికే ఒక నిశ్శబ్ద మహమ్మారిగా మారింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే మానవుడి జీవనశైలిలో 20, 30ఏళ్లలోనే వ్యాధులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం తీవ్రమైన సమస్యలకు, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయడంతోపాటు, కుటుంబాలు మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అధిక భారాన్ని మోపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన స్క్రీన్ సమయం, తక్కువ శారీరక శ్రమ, ఎక్కువసేపు కూర్చోవడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం వల్లే ఊబకాయం బాధితుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంటున్నారు. పిల్లలలో పెరుగుతున్న ఊబకాయం.. ఒకప్పుడు అరుదుగా భావించినప్పటికీ.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వంటి సమస్యలకు ఇప్పుడు దారితీస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఆహారపు అలవాట్లపై అవగాహన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, శారీరక శ్రమను పెంచడం వంటి విధానాల ద్వారా ఊబకాయం సమస్యను అధిగమించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
