Bihar New CM : బీహార్ రాజకీయాల్లో బిగ్ ఛేంజ్.. నూతన ముఖ్యమంత్రి అతనే..! అధికారికంగా ప్రకటించడమే తరువాయి..
Bihar New CM : నితీశ్ రాజీనామా తరువాత బీజేపీ నేత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా బీజేపీ తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రేసులో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు.
Bihar New CM
- బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం
- సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్
- 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
- నూతన ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి?
Bihar New CM : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ రాజీనామా చేసే తేదీ ఖరారైంది. ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గురువారం పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఏప్రిల్ 10వ తేదీన (శుక్రవారం) రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆరోజు పాట్నాలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి.. ఈ సమావేశం వేదికగా నితీశ్ తన రాజీనామాను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, నితీశ్ రాజీనామా తరువాత తదుపరి సీఎం ఎవరు అనే అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతం చర్చ జరుగుతుంది.
నితీశ్ రాజీనామా తరువాత బీజేపీ నేత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా బీజేపీ తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రేసులో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. నితీశ్ కుమార్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు బీహార్ కు చెందిన బీజేపీ ముఖ్యనేతలుకూడా హాజరవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్థి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉంది.
నితీశ్ కుమార్ ఈనెల 10వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరుసటి రోజు (ఏప్రిల్ 11న) పాట్నాకు తిరిగి వస్తారు. ఆ తరువాత సీఎం పదవికి రాజీనామా చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 14వ తేదీన ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఏప్రిల్ 15న కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చునని రాజకీయ వర్గాల సమాచారం. బీహార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది.
బీహార్ ముఖ్యమంత్రి రేసులో సమ్రాట్ చౌదరితోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, సమ్రాట్ చౌదరి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు, బిహార్లో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయితే, దానికి తన మద్దతు ఉంటుందని జనశక్తి జనతా దళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో సమ్రాట్ చౌదరి పేరును సీఎం పదవికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో 88 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండగా, జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. 2025 ఎన్నికల్లో ఎన్డీఏ మొత్తం 202 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
