Onions
Onion Price: రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. ప్రతిఒక్కరి ఇంట్లో నిత్యావసరాల వస్తువుల జాబితాలో ఉల్లిపాయలు కూడా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో హోల్ సేల్ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ. 40 నుంచి రూ.50 వరకు విక్రయాలు చేశారు. దీంతో పేద వర్గాల ప్రజలు తమ వంటల్లో ఉల్లిపాయను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి.
యాసంగి కొత్త పంట మార్కెట్ కు వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు సగానికి తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డ ధర రూ. 15 నుంచి రూ.20 వరకు విక్రయాలు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని మెయిన్ హోల్ సేల్ మార్కెట్లు అయిన ఉస్మాన్ గంజ్, మలక్ పేట, సికింద్రాబాద్ మోండా, బోయిన్ పల్లితోపాటు పలు రైతు బజార్లకు పెద్దెత్తున ఉల్లి వస్తుంది. దీంతో ధరలు పడిపోతున్నాయి.
మహారాష్ట్ర, కర్నూల్ నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో 40వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. ప్రతీయేటా ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికి వస్తుంది. దీంతో మార్కెట్లకు ఉల్లిగడ్డలు భారీగా వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలోని మార్కెట్లకు రోజుకు 15వేల నుంచి 18వేల క్వింటాళ్లు ఉల్లిగడ్డలు వస్తున్నాయి. మరోవైపు ఉల్లిపై 20శాతం ఎక్స్ పోర్ట్ ట్యాక్స్ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కారణంగానూ ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి.