ఓయూ ఫేక్ ఇన్ఫో కేసు.. చంచల్‌గూడ జైలుకు క్రిశాంక్

ఓయూ ఫేక్ ఇన్ఫో కేసులో అరెస్టైన బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

Manne Krishank: బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫేక్ సర్క్యులర్ సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో బుధవారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ 466, 468, 469, 505(1)(C) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్‌ను పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద నిన్న అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిశాంక్‌పై గతంలో 14 కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో నాగేందర్ అనే నిజాం కాలేజ్ బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్‌పైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు. మన్నె క్రిశాంక్‌ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రకటించారు.

Also Read: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

అందుకే కేసు పెట్టాం: ఓయూ రిజిస్ట్రార్
ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంట్ కోతలు లేవని.. గతేడాది ఇచ్చిన సర్క్యులర్‌నే యధావిధిగా ఇచ్చామని ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. ”అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మే 1 నుంచి 31 పీజీ విద్యార్థులు అందరికీ వెకేషన్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్స్ యధావిధిగా తెరిచి ఉంటాయి. వివిధ పోటీ పరీక్షల రాసే విద్యార్థులు ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాం. ఫేక్ సర్క్యులర్‌తో సోషల్ మీడియాలో యూనివర్సిటీ గురించి తప్పుగా ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల”ని కేసు పెట్టామని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు