DAV Public School : సఫిల్‌గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఉతికారేసిన పేరెంట్స్.. అత్యాచార నిందితుడిని సపోర్ట్ చేశాడని ఆగ్రహం

అత్యాచార నిందితుడు రజనీకుమార్ కు సఫిల్ గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మద్దతు పలకడంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రిన్సిపాల్ ను చితకబాదారు.

DAV Public School : సఫిల్‌గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఉతికారేసిన పేరెంట్స్.. అత్యాచార నిందితుడిని సపోర్ట్ చేశాడని ఆగ్రహం

Updated On : October 20, 2022 / 8:14 PM IST

DAV Public School : హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనతో సఫిల్ గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్ లోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ అయిన రజనీకుమార్ గతంలో సఫిల్ గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో పని చేయడంతో విద్యార్థుల పేరెంట్స్ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ వివరణ కోరారు.

అయితే కీచకుడు రజనీకుమార్ కు డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మద్దతు పలకడంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రిన్సిపాల్ ను చితకబాదారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు తగ్గలేదు. ప్రిన్సిపాల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత కొనసాగింది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని డీఏవీ స్కూల్‌ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి(55) కారు డ్రైవర్ రజనీకుమార్‌(34) ఎల్ కేజీ చదువుతున్న నాలుగున్నరేళ్ల బాలికపై రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ సోమవారం మరింత బరి తెగించాడు. ఆ బాలికను పాఠశాలలోని డిజిటల్‌ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు కీచకుడు రజనీకుమార్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్‌ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”ప్రిన్సిపాల్‌ మాధవి డ్రైవర్‌ రజనీకుమార్ స్కూల్‌లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఈ విషయంలో ప్రిన్సిపాల్‌ మాధవి నిర్లక్ష్యం ఉంది. అందువల్లే ఈ ఘటన జరిగింది. మాధవిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, అరెస్టు చేశాం’’ అని ఏసీపీ సుదర్శన్‌ వివరించారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఈ ఘటనలో ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు రజనీకుమార్‌ సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు.

కాగా, రజనీకుమార్ గతంలో సఫిల్ గూడ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో పని చేసిన సమయంలోనూ విద్యార్థులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.