Jagtial : ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలు.. తిరిగి అప్పగించిన మహిళా కండక్టర్
కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.

RTC conductor gold return
Jagtial RTC Conductor Return Gold : జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ నిరూపించుకున్నారు. బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్ ను ఆమెకు తిరిగి ఇచ్చి కండక్టర్ తన మంచితనాన్ని చాటుకున్నారు. ఓ మహిళా ప్రయాణికురాలు రూ.8లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్ ను బస్సులోనే మరిచిపోయారు. ఆ బ్యాగ్ ను గమనించిన ఆర్టీసీ కండక్టర్ తిరిగి ప్రయాణికురాలుకు అప్పగించారు.
వివరాళ్లోకి వెళ్తే..శుక్రవారం రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలు ప్రయాణించారు. జగిత్యాల రాగానే మహిళ తన బ్యాగ్ ను బస్సులోనే మరిచి దిగిపోయారు. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ ను మహిళా కండక్టర్ గమనించారు. ఆ బ్యాగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం అందించారు.
Election Code Effect : బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ ను సదరు ప్రయాణికురాలికి అప్పగించారు. కండక్టర్ వాణి నిజాయితీని డిపో మేనేజర్ అభినందించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, ప్రయాణికుల పట్ల ఇది తమ నిబద్ధత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రయాణికురాలు భవానీ మాట్లాడుతూ తన నగలు దొరకక పోయి ఉంటే దసరా పండుగ కన్నీళ్లతో గడిచేదని వెల్లడించారు. నిజాయితీగా తన బంగారు ఆభరణాలను అందించిన కండక్టర్ వాణికి, డ్రైవర్ తిరుపతికి ప్రయాణికురాలు కృతజ్ఞతలు తెలిపారు.