Veera Raghava Reddy : రామరాజ్యం కేసుకు సంబంధించి సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. చిలుకూరు బాలజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాని నిందితుడైన వీర రాఘవ రెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ఒక మ్యూజిక్ టీచర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన వీర రాఘవ రెడ్డి.. ఆ తర్వాత హిందూ ధర్మాన్ని రక్షించాలన్న భావనతో వీడియోలతో ప్రచారం చేసి ఆ తర్వాత తనకు తానుగా శివుడి అవతారంగా భావించుకున్నాడు. రామరాజ్య స్థాపన కోసం ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకునేందుకు ఏకంగా ట్రస్ట్ పెట్టి ఆలయాల్లో అర్చకులపై దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసు సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా వీర రాఘవ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి మ్యూజిక్ టీచర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. తాను ఇక్ష్వాక వంశీయుడిని అని చెప్పుకుంటూ రామ రాజ్య స్థాపన కోసం ప్రైవేట్ గా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇతర ధర్మాలన్నీ కలిసి హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయని కోర్టులు పోలీసులు కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం లేదని భావించిన వీర రాఘవ రెడ్డి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని రామ రాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
Also Read : కాపు సామాజికవర్గం ఓట్లపై వైసీపీ ఫోకస్.. ఏం జరుగుతోందో తెలుసా?
తనను తాను శివుడి అవతావరంగా భావించిన వీర రాఘవ రెడ్డి దుష్టశిక్షణ, శిష్టరక్షణ పేరుతోనే రామరాజ్యం సాధ్యమని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లోనే కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో వీర రాఘవ రెడ్డి ఒక ఎన్జీవోను రిజిస్ట్రర్ చేయించాడు. ఆ ట్రస్ట్ కు తన భార్యే ఛైర్మన్ గా ఉంది. ఈ ట్రస్ట్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్ సైట్ కూడా డిజైన్ చేయించినట్లుగా పోలీసులు తెలిపారు.
కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశాడు. మొదటి స్లాట్ లోనే 5వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. సోషల్ మీడియాలో పలు వీడియోల ద్వారా ప్రచారం మొదలుపెట్టాడు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు తన ఆర్మీలో ఉండొచ్చని, రామరాజ్య స్థాపన కోసం తాను చెప్పిన పని చేయాలని కండీషన్ పెట్టాడు. కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించాడు. 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యం ఉన్న వారిని నియమించుకుంటామని తెలిపారు.